రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్... అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే భేటీకి... అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు అఅన్ని శాఖల మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు.
విదేశీయులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన విదేశీయులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలటం వల్ల ప్రజలంతా... అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని.. ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతే ఇంటికి పంపాలని స్పష్టంచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. అనుమానితులు ఎవరైనా ఉంటే ప్రభుత్వానికి సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు.