CM KCR on Assembly Elections 2023 : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నికలకు మరో ఏడాది ఉన్న వేళ.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు.
'నేతలందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకునిపోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలి. వీలైనంత వరకు నేతలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. త్వరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ.'-సీఎం కేసీఆర్
ముందస్తు ఎన్నికలు ఉండవు : ముందస్తు ఎన్నికలు ఉండవన్న కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నేతలకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, శాసనసభ్యులు బాధ్యత తీసుకొని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం మిగిలి ఉన్న రెండు పడకల గదుల ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని, 58,59 జీవోల కింద క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంపును పేద ప్రజల కోసం సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.
గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలి :దళితబంధు రెండో విడత కోసం స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేసి సంబంధిత కలెక్టర్లకు పంపించాలన్న సీఎం... అవినీతికి ఆస్కారం లేకుండా లబ్దిదారులకు నిధులు అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో వివరించారు. కొత్తగా తీసుకొస్తున్న గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత బంధు సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ నేతలందరూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు.