గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ నిబంధనలు 2005కు అనుగుణంగా ఎన్నిక విధానాన్ని ప్రకటించింది. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు చట్టప్రకారం నమోదయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎన్నికకు విప్ వర్తిస్తుందని.. విప్ ఉల్లంఘించినా వారి ఓటు చెల్లుబాటు అవుతుందని వివరించింది. సభ్యుల ప్రమాణస్వీకారాల తర్వాత అదే రోజు మొదటగా మేయర్, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది. సర్వసభ్య సమావేశానికి సగం మంది సభ్యుల హాజరు కోరం తప్పనిసరని తెలిపింది.
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై స్పష్టత - ghmc mayor
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. కార్పొరేటర్లు సహా ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నికను నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. సర్వసభ్య సమావేశానికి సగం మంది సభ్యుల హాజరు తప్పనిసరని వెల్లడించింది.
మేయర్ పదవికి ఒకరే పోటీ పడితే ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారని పేర్కొంది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మేయర్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణకు ఆస్కారం లేదు. కోరం లేకపోయినా, ఎన్నిక జరగకపోయినా మరుసటి రోజు మళ్లీ చేపడతారు. రెండో రోజు కూడా జరగకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఎన్నిక కోసం అవసరమయ్యే నమూనా పత్రాలను కూడా సర్క్యులర్‌తో పాటు ఎస్ఈసీ జతచేసింది.
ఇదీ చూడండి: రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్