కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి గింజ కొనాలన్న ఉద్దేశంతో ఏ గ్రామంలో ధాన్యం ఆ గ్రామంలో కొనుగోలు కోసం 5973 కేంద్రాలు ప్రారంభించి ఖరీదు చేస్తున్న తరుణంలో వ్యాపారులతో కుమ్ముకయ్యారని విపక్షాలు చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎక్కడో ఒక చోట తలెత్తిన తాలు అంశం పేరిట ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
'విపక్షాల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం'
విపక్షాల విమర్శలపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని విపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తాలు అంశం పేరిట విపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ, 1500 రూపాయల నగదు పంపిణీ సాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 23.53 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకున్నారని చెప్పారు. 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 414 మెట్రిక్ టన్నుల కందిపప్పు తీసుకున్నారని తెలిపారు. వలస కార్మికులకు 12 కిలోల చొప్పున 423 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని స్పష్టం చేశారు. పెన్షనర్ల రద్దీ దృష్ట్యా 1500 రూపాయల నగదు తపాలా కార్యాలయాల ద్వారా మంగళ, బుధవారాల్లో అందజేస్తామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్