తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ నెల మెుత్తం రేషన్​ బియ్యం సరఫరా చేస్తాం'

తెల్లరేషన్​ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి హామీ ఇచ్చారు. ఛౌక ధరల దుకాణాలకు కూపన్​ తీసుకున్న మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యం తీసుకుంటేనే 1500 రూపాయల నగదు ఇస్తారనే ప్రచారం నమ్మొద్దని ఆయన వివరించారు.

By

Published : Apr 4, 2020, 4:20 AM IST

civil-supplies-chairman-maareddy-srinivas-reddy-spoke-on-ration-rice-distribution
'ఈ నెల మెుత్తం రేషన్​ బియ్యం సరఫరా చేస్తాం'

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం అందిస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. రేషన్ పంపిణీపై హైదరాబాద్ పౌరసరఫరాల భవన్‌లో తన ఛాంబరులో ఆయన అధికారులతో సమీక్షించారు. కూపన్ తీసుకున్న లబ్ధిదారులు... తీసుకోని కార్డుదారులు అందరూ కూడా ఒకేసారి ఛౌక ధరల దుకాణాలకు రావడం వల్ల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా... కూపన్ తీసుకున్న వారు మాత్రమే దుకాణాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

స్టేట్ డాటా సెంటర్ - ఏడీసీలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల కొన్ని చోట్ల సర్వర్ డౌన్ అయింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెంటనే స్పందించి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో రికార్డు స్థాయిలో 14 లక్షల కార్డుదారులు 55,561 మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోగా... శుక్రవారం ఒక్క రోజు మధ్యాహ్నం వరకు 4 లక్షల మంది రేషన్ తీసుకున్నారని శ్రీనివాసరెడ్డి వివరించారు. 2.80 కోట్ల మందికి కావాల్సిన 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో నిల్వ ఉంచినందున బియ్యం అందుతాయో లేదో అనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల మొత్తం రేషన్ బియ్యం సరఫరా చేస్తామని... ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు నిరంతరాయంగా తెరిచే ఉంటాయని ప్రకటించారు.

గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధన ఎత్తివేస్తున్నామని తెలిపారు. కేంద్రం నిబంధనల ప్రకారం అన్న వితరణ్ పోర్టల్‌లో రేషన్ వివరాలు నమోదు కోసం తప్పనిసరిగా బయో మెట్రిక్ విధానం అమలు చేయవలసి వస్తున్నప్పటికీ... ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని నిబంధనలను సడలించిందన్నారు. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న లబ్ధిదారులు వేలిముద్ర వేయకుండానే తీసుకునే సదుపాయం కల్పించిందని... పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారికి మాత్రం వేలిముద్ర వేసి బియ్యం తీసుకోవాలని సూచించారు. రేషన్ బియ్యం తీసుకుంటేనే 1500 రూపాయల నగదు ఇస్తారనే ప్రచారం నమ్మొద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. బియ్యం తీసుకున్నా... తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్‌లైన్‌ ద్వారా 1500 రూపాయల నగదు తమ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

'ఈ నెల మెుత్తం రేషన్​ బియ్యం సరఫరా చేస్తాం'

ఇవీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు

ABOUT THE AUTHOR

...view details