చరవాణీలను ఎత్తుకెళ్లే రెండు దొంగల ముఠాలను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఓ చరవాణీ, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌లోని నవజీవన్ నగర్‌లో నివాసముంటున్న అలకుంట్ల నవీన్, డ్రైవర్ గోగుల శివకుమార్, దండ్ల పరుశురాములు అలియాస్ రిషి స్నేహితులు. జల్సాలకు అలవడిన నిందితులు పల్సర్‌పై తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
ముగ్గురూ కలిసి గత నెల 25న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో దారి పక్కనే నిల్చుని ఫోన్ చూస్తున్న క్యాబ్ డ్రైవర్ నాగరాజు చరవాణి లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని... సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
అత్యవసర కాల్ అంటారు... ఆపై ఫోన్‌తో ఉడాయిస్తారు
మరో సంఘటనలో అత్యవసర ఫోన్ చేసుకోవాలంటూ ఓ వ్యక్తి నుంచి చరవాణీని తీసుకుని పరారైన సంఘటనలో ఓ యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. గత నెల 20న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో అర్ధరాత్రి 12గంటల సమయంలో ఇదే తరహాలో మరో చోరీకి పాల్పడ్డారు. ఫిల్మ్ నగర్ వినాయక నగర్‌లో నివసించే రత్నకుమార్‌ను అడ్డగించి యాక్టివాపై వచ్చిన వీరు అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకుని ఉడాయించారు.
రెండింటిలోనూ నిందితులు వారే...
చరవాణీ దొంగల ముఠా అరెస్ట్
గత నెల 30న శ్రీకృష్ణనగర్‌లో దుబ్బాక మహేష్ అనే యువకుడు తన గదిలో చరవాణికి చార్జింగ్ పెట్టి నిద్రపోగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులను దర్యాప్తు చేపట్టిన పోలీసులు... రెండింటిలో నిందితులు వాళ్లేనని నిర్ధారించి సీసీ పుటేజీ ఆధారంగా నిర్థారించారు.ఈ కేసులో నిందితులు సాయి కిరణ్ అలియాస్ చింటుతో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. మైనర్లను బాలుర పునరావాస కేంద్రానికి తరలించగా మిగతా వారిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఫొటో తీశాడని పోలీసుని ఇటుకతో కొట్టాడు!