తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు.. - కార్గోబస్సుల తాజా వార్త

రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారం నుంచి కార్గో సేవలు  ప్రారంభం కానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ఎగుమతులు, దిగుమతులుపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఏఏ శాఖల ద్వారా తొలుత ఈసేవలను అందించాలనే అంశంపై అధ్యయం చేపట్టారు.

cargo-buses-ready-to-inauguration-in-hyderabad
వచ్చేనెల నుంచి సేవలందించనున్న 52 కార్గో బస్సులు

By

Published : Jan 11, 2020, 9:06 AM IST

Updated : Jan 11, 2020, 11:14 AM IST

సరకు రవాణాకు ఆర్టీసీ కార్గో బస్సులు సిద్ధమవుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి కనీసం పది మంది వరకు వినియోగదారులను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏయే శాఖల ద్వారా సరకు రవాణాకు అవకాశాలున్నాయన్న అంశంపై అధికారులు ప్రాథమికంగా అధ్యయనం చేపట్టారు. తొలుత వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతోపాటు విత్తనాభివృద్ధి, మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలను గుర్తించారు. తాజా పరిశీలనలో మరో 15 శాఖల వరకు రవాణాకు అవకాశాలున్నాయని గుర్తించినట్లు సమాచారం. వాటిల్లో ఏ స్థాయిలో రవాణా చేయవచ్చు? ఏడాదిలో ఎంత కాలం ఉంటుంది? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రత్యేకించి హైదరాబాద్‌ వచ్చే ఉత్పత్తులు ఏమిటన్నది అధికారులు ఆరా తీస్తున్నారు.

కార్గో సేవలకు అధిక కిలోమీటర్లు తిరిగిన బస్సులను వినియోగించాలని నిర్ణయించారు. 12 నుంచి 15 లక్షల కిలోమీటర్ల మేరకు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. అలాంటి వాటిలో కొద్దిపాటి మార్పులు చేయటం ద్వారా మరో పది లక్షల కిలోమీటర్ల వరకు బస్సులను నడిచేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కిలోమీటర్ల పరంగా చూస్తే ప్రస్తుతం ఆర్టీసీ వద్ద సుమారు 2200 వరకు కాలం చెల్లిన బస్సులున్నాయి. ఇందులో మొదట 800 నుంచి 850 బస్సులను కార్గో సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. అన్ని బస్సులను ఒకే దఫా సిద్ధం చేసే అవకాశాలు లేకపోవటం, కార్గో సేవలకు ఏ స్థాయిలో డిమాండ్‌ ఉంటుంది? ఏడాదిలో ఎంత కాలం ఉంటుంది? అన్నది పరిశీలించిన అనంతరం బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలిదశలో 52 బస్సులను సిద్ధం చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా సిబ్బందిని గుర్తించారు.

పుర ఎన్నికలు, మేడారం జాతర తర్వాతే
కార్గో సేవలను జనవరిలో ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ మున్సిపల్‌ ఎన్నికలు, మేడారం జాతర నేపథ్యంలో సాధ్యపడడం లేదు. ఈ నెల 27వ తేదీతో మున్సిపల్‌ ఎన్నికల క్రతువు పూర్తవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మేడారం జాతర ఉంది. ఆ జాతరకు ఆర్టీసీ సుమారు 450 వరకు ప్రత్యేక బస్సులను వినియోగిస్తోంది. ఈ పరిస్థితుల కారణంగానే ఫిబ్రవరి రెండో వారంలో కార్గో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..

ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

Last Updated : Jan 11, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details