ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పటికీ విధులకు హాజరు కాని దుస్థితి నెలకొంది. చట్టవిరుద్ధంగా సమ్మెలోకి వెళ్లిన కార్మికులు... ఇష్టారీతిన మళ్లీ విధుల్లో చేరతామంటే నిబంధనలు అంగీకరించబోవని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ సమస్యను ముగించేందుకే రేపు మంత్రివర్గాన్ని సమావేశపరుస్తున్నట్లు స్పష్టం చేసిన సర్కార్... అవసరమైతే శుక్రవారం కూడా భేటీ కొనసాగించనున్నట్లు తెలిపింది.
అందరినీ కొనసాగిస్తారా లేదా?
ప్రస్తుతమున్న 49 వేల మంది సిబ్బందిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా లేదా అనే విషయం మంత్రి వర్గం నిర్ణయించనుంది. ఇప్పుడు ఉద్యోగులు, సిబ్బందిని ఎలా తగ్గిస్తారనేది అందరి ప్రశ్న. ఇందుకోసం ఏం చేస్తారు... ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్న విషయమై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిర్బంధ లేదా స్వచ్ఛందంగా పదవీవిరమణ అమలు చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది.