BRS War Rooms Strategy in Assembly Elections 2023 : ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బూత్‌స్థాయిలో ప్రచార ప్రణాళికల రూపకల్పనకు నియోజకవర్గాల వారీగా వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ఇంఛార్జ్ నేతృత్వంలోని ఒక్కో వార్‌రూమ్‌లో (War Rooms) 350 మందిని నియమించారు. కేటీఆర్, హరీశ్‌రావు పర్యవేక్షణలోని.. రాష్ట్రస్థాయి వార్‌రూమ్‌లో పరిస్థితిని విశ్లేషించి.. ఎప్పటికప్పుడు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
ఎన్నికల మేనిఫెస్టోను (BRS Manifesto) ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం నిర్వహిస్తారు. తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వార్‌రూమ్ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి బూత్‌లోని మెజార్టీ ఓట్లు పడేలా బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలను తయారు చేసింది. రాష్ట్రంలోని 3.17 కోట్ల ఓటర్లను నాలుగు కేటగిరీలుగా గులాబీ పార్టీ విభజించింది. కార్యకర్తలు, కచ్చితంగా భారత్ రాష్ట్ర సమితికే ఓటు వేస్తారని భావించే వారు ఏ కేటగిరీలో.. ఏ పార్టీకి వేయాలో తేల్చుకోలేని ఓటర్లను బీ కేటగిరీగా విభజించింది.
బీఆర్ఎస్‌పై కోపంతో ఉన్న ఓటర్లను సీ కేటగిరీ కింద.. ఇతర పార్టీల కార్యకర్తలు, భారత్ రాష్ట్ర సమితికి ఓటు వేయరని భావించే వారిని డీ కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు. 4 కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి.. తమవైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్‌రూమ్‌లో నిర్ణయిస్తారు. తెలంగాణభవన్‌లో వార్‌రూమ్ ప్రతినిధులతో నేడు కేటీఆర్ సమావేశం కానున్నారు. పోలింగ్ ముగిసే వరకూ ఎలా వ్యవహరించాలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
BRS Assembly Elections Campaign 2023 : ఇప్పటికే మూడంచెల ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్.. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేనిఫెస్టో, ఇతర ప్రచారాస్త్రాలు, సానుకూల అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తీసుకెళ్తారు. విపక్షాల విమర్శలు, ఆరోపణలను అక్కడే తిప్పికొట్టేలా వ్యూహాన్ని రచించారు. అభ్యర్థుల ప్రకటనలో ఇతర పార్టీల కంటే ముందుడగు వేసిన భారత్ రాష్ట్ర సమితి ప్రచారంలోనూ దూసుకెళ్తోంది.