BJP state president Bandi sanjay fires on CM KCR: పోలీసులు, తెరాస గుండాలు అడ్డుకున్నా... భాజపా యాత్ర ఆగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ 4వ ప్రజా సంగ్రామ యాత్ర కుత్భుల్లాపూర్‌లోని రాంలీలా మైదానంలో ప్రారంభమైంది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్.. ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. అసోం సీఎంకు భద్రత కల్పించలేని దురవస్థ ఏర్పడిందని మండిపడ్డారు. ధర్మం కోసం, సమాజం కోసం భాజపా పోరాడుతోందని హితవు పలికారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
'' వినాయక నిమజ్జనంలో అసోం సీఎం వస్తే తెరాస నేత అడ్డుకున్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం... ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కేసీఆర్ వసూళ్లకు భయపడి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక్కడ నీరు, గాలి పూర్తిగా కలుషితమైపోయింది. రోడ్లు లేవు... డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేదు. వరదలు, వర్షం వస్తే హైదరాబాద్‌లో ఇల్లు మునిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే మతతత్వం అంటున్నారు. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినంను పరేడ్ గ్రౌండ్‌లో కిషన్ రెడ్డి నేతృత్వంలో జరుపుతాం.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దారుసలాంలో సమావేశం తరవాత సీఎం కేసీఆర్ జాతీయ సమైఖ్యత దినోత్సవం జరుపుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను నిజాం నవాబులు చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. నాటి నిజాం వారసులే నేటి ఎంఐఎం నేతలని అభివర్ణించారు. ఈడీ కేసుల్లో, లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుటుంబసభ్యులే ఉన్నారని ఆరోపణలు చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు మరో ఆర్ జోడిస్తామని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.