Laxman on TSPSC Paper Leakage Issue: రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ మండిపడుతున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక ప్రభుత్వ మద్దతు ఉందని సర్కార్‌ను విమర్శలతో ముంచెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తాజాగా స్పందించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సర్కార్‌పై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. లీకేజ్ ఘటనకు కేటీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కేసును సిట్‌కు అప్పగించడంపై లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీకేజీ వెనక ఉన్న పెద్ద తలకాయల బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
'మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే టీఎస్‌పీఎస్‌సీ నడుస్తోంది. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారి పోయాయి. నయీం కేసు దర్యాప్తును సిట్ ఇంతవరకు తేల్చలేదు. కీలక కేసుల్లో హడావుడి చేయటం తప్ప కేసులు పూర్తి చేయలేదు. 8 ఏళ్ల అవుతున్నా ఓటుకు నోటు కేసు ఇప్పటికీ తేలలేదు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పోలీసు, నిఘా వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు.'-లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యడు