తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడుపై భాజపా ఫోకస్‌, ఎంతలా అంటే - మునుగోడు ఉపఎన్నికపై భాజపా ఫోకస్

BJP focus on munugode by poll మునుగోడు ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. భాజపా జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నిక, అమిత్‌షా బహిరంగ సభ, పార్టీలోచేరికలపై చర్చించారు.

రాష్ట్ర నేతలతో  భాజపా జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ భేటీ
మునుగోడుపై భాజపా ఫోకస్‌, ఎంతలా అంటే

By

Published : Aug 19, 2022, 3:52 PM IST

Updated : Aug 19, 2022, 4:36 PM IST

BJP focus on munugode by poll కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించి తెరాసకు సరైన గుణపాఠం చెబుతామన్న భాజపా ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన భాజపా జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌.. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశం అవుతున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సమావేశమైన ఆయన... మునుగోడు ఉప ఎన్నిక, అమిత్‌షా బహిరంగ సభ, పార్టీలోచేరికలపై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతోనూ శివప్రకాశ్‌ సమావేశమైనట్లు సమాచారం. పార్టీ సంస్థాగత అంశాలపై... సంఘ్ పెద్దల నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఇక్కడే ఉండనున్న శివప్రకాశ్‌ పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్ర నేతలతో భాజపా జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ భేటీ

క్షేత్రంలోకి భాజపా ముఖ్య నేతలు:కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయాలనే తలంపుతో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ నియమించిన ఇన్‌ఛార్జ్‌లు గురువారం అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్‌తో సమీక్షలు నిర్వహించారు. చౌటుప్పల్‌, నాంపల్లి మండలాల్లో జరిగిన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ సైతం ఇక్కడే మకాం వేశారు. అమిత్‌షా సభకు ఇంకా రెండు రోజులే ఉండటం, సీఎం సభ సైతం రేపు (20న శనివారం) ఉండటంతో అంతకు మించి జనసమీకరణ చేయాలని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలంతా క్షేత్రస్థాయిలో దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గాన్ని వీడకుండా ఎప్పటికప్పుడు వారి వ్యూహాలకు చెక్‌పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 20న తెరాస సీఎం కేసీఆర్‌ సభ: అయితే మరోవైపు మునుగోడు రాజకీయం క్షేత్రస్థాయికి చేరింది. అన్ని పార్టీలు ఉప ఎన్నికల పోరును కార్యక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అమిత్‌షా సభకు ముందుగానే మునుగోడు కేంద్రంగా ఈ నెల 20న తెరాస సీఎం కేసీఆర్‌ సభకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణతో సభ నిర్వహించాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించారు. సీఎం సభకు తమను ఆహ్వానించలేదని కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో పాటూ పలు మార్గాల ద్వారా తెరాస అధిష్ఠానం తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తుండటంతో తమకు ఇష్టం లేకపోయినా కొంత మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎం సభ అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కార్యకర్తలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌:తెరాస, భాజపాల నుంచి వస్తున్న ఆఫర్‌లతో ఆయా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న తమ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైంది. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు మండలాల వారీగా ఉన్న ఇన్‌ఛార్జ్‌లు అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఏడాది కాలం ఓపికగా ఉంటే వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని నచ్చజెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 19, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details