మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రతి వార్డులో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇప్పటికే భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించిన నగరపాలికలతో పాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పెద్ద ఎత్తున తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు భాజపా గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భాజపా విజయదుందుభి మోగించడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.
సీనియర్లతో క్లస్టర్లపై దృష్టి...
లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు చవిచూసిన భాజపా నాయకులు... పురపోరులోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌ను మినహాయించి... మిగిలిన 15 పార్లమెంట్ స్థానాలను 15 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కు పాత, కొత్త నేతలతో కమిటీలు వేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా నియమించారు. భాజపా ఎంపీ స్థానాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.
కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి...
తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత, భాజపా వికసిస్తుందనడానికి 4 ఎంపీ స్థానాలు గెలవడమే నిదర్శనమని చెబుతూ వస్తోన్న కమలనాథులకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన భాజపా వాటి పరిధిలోని మున్సిపాల్టీలను కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అక్కడ ప్రభావం చూపకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడనుండటం వల్ల కసరత్తు ప్రారంభించారు.