యాదవుల ఐక్యతకు అద్దంపట్టే సదర్ సంబురాలు కన్నుల పండువగా సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన దున్నపోతుల సయ్యాటలు హైదరాబాదీలను ఆకట్టుకున్నాయి. భారీ దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఆడించిన తీరు అబ్బురపరిచింది. మెడలో గంటలు, గవ్వలు... కాళ్లకు గజ్జలు కట్టి దున్నపోతులను నగర ప్రధాన వీధుల్లో ఊరేగించారు.
వేడుకల్లో కిషన్ రెడ్డి, తలసాని
కాచిగూడ నింబోలి అడ్డాలో జరిగిన ఉత్సవాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అందంగా అలంకరించిన దున్నపోతులు ఆకట్టుకున్నాయి. యువకుల కర్రసాము విన్యాసాలు ఔరా అనిపించాయి. ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దీపావళి పండుగ అనంతరం జంట నగరాల్లో యాదవులు వైభవోపేతంగా ఈ వేడుకలు జరుపుకుంటారని తలసాని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అధికారికంగా సదర్ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తానని తలసాని హామీ ఇచ్చారు.
నగర వీధుల్లో ఘనంగా ఊరేగిన దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా హరియాణా దున్నరాజు
సికింద్రాబాద్‌లో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన దున్నపోతులను ఆడించారు. డీజే చప్పుళ్లకు యాదవులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. మాదాపూర్‌లో సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. హరియాణాకు చెందిన రూ.30 కోట్లు విలువ చేసే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని నడక, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మేళ తాళాలు, నృత్యాల నడుమ ఊరేగించారు. నార్సింగిలో జరిగిన సదర్ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో పాటు ముస్లింలు పాల్గొన్నారు. యాదవులు శ్రీకృష్ణునికి పూజలు చేసి అందంగా ముస్తాబు చేసిన దున్నపోతులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
ఇవీ చూడండి : కన్న బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం