ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సాంకేతిక అంశాల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఓ నివేదికను ఇచ్చింది. రాజధానిపై అధ్యయనానికి బీసీజీని కూడా ప్రభుత్వం నియమించటంతో ఈ కమిటీ ఇచ్చే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
ఈ నివేదిక వచ్చిన అనంతరం రెండు నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. 10 మంది మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఈ రెండు నివేదికల్ని అధ్యయనం చేసి మూడు వారాల్లోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ప్రభుత్వం రాజధాని తరలింపుపై ఓ నిర్ణయానికి రానుంది. ఈ నివేదికల ఆధారంగా జనవరి చివరి వారంలో.. శాసనసభలో రాజధాని తరలింపుపై కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది తర్వాత సచివాలయం తరలింపునకు సిద్ధం కావాల్సిందిగా అనధికారికంగానే ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.