Bandi Sanjay fire on KCR: ఏపీ సీఎంతో కుమ్మక్కై సీఎం కేసీఆర్ కేఆర్‌ఎంబీ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో 570 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఏపీ వాళ్లను గతంలో కేసీఆర్ అవమానించలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడు లేకుండనే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారని ఆయన ఎద్దేవా చేశారు. నమ్మించి అందరి ఓట్లు వేయించుకోవడం కేసీఆర్‌కు తెలిసిన విద్యేనని దుయ్యబట్టారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ రెచ్చగొడతారని ధ్వజమెత్తారు.
దేశమంతటా ఉచిత విద్యుత్ అందిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఈరోజు డిస్కమ్‌లు రూ.60 వేల కోట్లు నష్టాల్లో ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునర్ధించలేదని మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది.. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్ చెప్పాలని ఆయన దుయ్యబట్టారు.