హైదరాబాద్‌లో వినాయక ఉత్సవాల్లో ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉండేవి రెండు అంశాలు. ఒకటి ఖైరతాబాద్ గణేష్ ఎత్తుపై అయితే మరొకటి బాలాపూర్ లడ్డు ధర. ఎంతో పేరున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేస్తోంది.
పోటా పోటీ
బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది వేలం పాట కోసం ఇప్పటికే 18 మంది శాశ్వత సభ్యులతో పాటు ఐదుగురు స్థానికులు, మరో 5 మంది స్థానికేతరులు పేర్లు నమోదు చేసుకున్నారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు చివరి పూజ పూర్తైన అనంతరం బాలాపూర్ గణేశుడు గ్రామ ఊరేగింపునకు బయల్దేరుతాడు. ఆ తర్వాత బొజ్జగణపయ్య గ్రామ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్దకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చేరుకుంటాడు. అప్పుడు లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూ వేలంపాట ప్రారంభిస్తారు.
1994లో మొదలైన లడ్డూ వేలం పాట
గ్రామాభివృద్ధి కోసం మొదలు పెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. మొదట 1994లో 450 రూపాయలతో వేలం పాట ప్రారంభమైంది. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను అందుకున్నారు. గతేడాది స్థానికేతరుడైన తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల, వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది.