ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా పేరొందిన బేగంపేట వైమానిక ప్రదర్శన అట్టహాసంగా సాగుతోంది. కరోనాతో కమ్ముకున్న అపోహలను పటాపంచలు చేస్తూ... పౌర విమాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. దేశవిదేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములవుతున్నారు. గగనతలంలో అబ్బురపరిచేలా విమానాల ప్రదర్శన సాగుతోంది.
నీలినీడలను అధిగమించి..
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా భయంతో... ఏవియేషన్ ప్రదర్శనపై కమ్ముకున్న నీలినీడలను అధిగమించిన 'వింగ్స్ ఇండియా - 2020' ప్రదర్శన నిర్వాహకులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఏవియేషన్ ప్రదర్శనలో భాగంగా రెండో రోజు జరిగిన సదస్సులో ఆయనతో పాటు.... పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఇండియా ఛైర్మన్ అరవింద్ సింగ్, పౌరవిమానయానశాఖ జాయింట్ కార్యదర్శి ఉషాపధి, ఫిక్కీ ఛైర్మన్ ఆనంద్ స్టాన్లీ, ఫిక్కీ ప్రెసిండెంట్ సంగీతారెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచ స్థాయి ఏరో స్పేస్ విశ్వవిద్యాలయం..
రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఏరో స్పేస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవియేషన్ రంగ అభివృద్ధి.. దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని పౌరవిమాన శాఖ జాయింట్ కార్యదర్శి ఉషా పధీ పేర్కొన్నారు.