తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం! - ఏపీ శాసనమండలి వార్తలు

ఏపీ శాసన మండలిని కొనసాగిస్తారా.. రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉదయం జరిగే ఏపీ మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మండలి రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ap cabinet meet on council abolish
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం!

By

Published : Jan 27, 2020, 8:16 AM IST

ఏపీలో 'పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ బిల్లు'లను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు... మండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపుతోంది. మండలిలో మెజారిటీ లేకపోవటం వల్ల శాసనసభలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఆగ్రహం చెందిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... మండలి రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

పార్టీలో ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతోనూ చర్చించిన జగన్.. మండలిపై వేటు వేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు మండలి రద్దు చేస్తామని అధికారికంగా చెప్పకపోయినా... రద్దుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు వైకాపా నేతలు స్పష్టం చేశారు. పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా రద్దుకే సీఎం నిశ్చయించినట్లు చెబుతున్నారు.

ఆకర్ష ఫలించలేదా?

ప్రజాభిప్రాయానికి, చట్ట సభల నిబంధనలకు ప్రజల శాసన సభలకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న శాసన మండలి అవసరమా అంటూ ఇటీవలే శాసనసభలో ముఖ్యమంత్రి జగన్​ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మండలి రద్దుపై మంత్రుల అభిప్రాయాలను గురువారం తీసుకున్నారు. అనంతరం 3 రోజులు గడువిస్తూ సోమవారానికి శాసన సభను వాయిదా వేశారు. ఆ తరువాత తెదేపా ఎమ్మెల్సీలను రాబట్టుకునేందుకు వైకాపా నేతలు పలు రకాలుగా ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సజ్జల వ్యాఖ్యలతో బలం

ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తమ సభ్యులను కాపాడుకునేందుకు తెదేపా పకడ్బందీ వ్యూహాలు రచించి అమలు చేసింది. ఆదివారం టీడీఎల్పీ భేటీకి దాదాపు అందరు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గైర్హాజరైన కొద్దిమంది తాము ఏ కారణాలతో రాలేకపోతున్నామో అధినేతకు ముందే తెలిపి అనుమతి తీసుకున్నారు. వైకాపా నేతల ప్రయత్నాలన్నీ విఫలమైనందున.. మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదింపజేస్తారని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. చట్టాలని గౌరవించని సభ ఎందుకనే అభిప్రాయంతో సీఎం జగన్ ఉన్నారని పార్టీ ముఖ్యనేత సజ్జల తెలపడం మండలి రద్దు చేస్తారనే వాదనకు బలం చేకూర్చుతోంది.

మూడు రాజధానులపైనా చర్చ

రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగంగా అమలు చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపైనా మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలిసింది. మండలి ఇప్పటికే నిరవధిక వాయిదా పడగా.. శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎలా ఉంటుందనే విషయమై ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. దీని సాధ్యాసాధ్యాలపై సీఎం జగన్ చర్చించారు. ఆర్డినెన్స్ సాధ్యమని భావిస్తే మంత్రి వర్గంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం!

ఇదీ చదవండి: పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details