తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 10:10 AM IST

ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పై ఆగని మరణ మృదంగం

బాహ్య వలయ రహదారిపై మరణ మృదంగం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట రక్తమోడుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నివారణకు చర్యలు తీసుకోవాల్సిన హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ), పోలీసులేమో అతి వేగమే కారణమని తేల్చేసి చేతులు దులుపుకొంటున్నారు. తాజాగా పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న బొలేరోను వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

124 road accidents in 274 days on Hyderabad ORR
ఓఆర్‌ఆర్‌పై ఆగని మరణ మృదంగం

158 కి.మీల అవుటర్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 2018తో పోలిస్తే 2019లో ప్రమాదాలు స్వల్పంగా పెరిగాయి. కానీ.. ఈ ఏడాది మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ వరకే 124 ప్రమాదాలు జరిగాయి. అంటే.. గతేడాది కంటే 17 ఎక్కువన్న మాట. లాక్‌డౌన్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ట్రాఫిక్‌ తగ్గింది. ఒకవేళ యథావిధిగా నడిచి ఉంటే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ ఒక్కసారిగా వాహనాలను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే అదుపుకాక ముందు వెళ్తున్న లేదా ఆగి ఉన్న వాహనాలను ఢీకొడుతున్నారు.

సీఆర్‌ఆర్‌ఐ అధ్యయనం...

సుమారు మూడేళ్ల కిందట దిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్సిట్యూట్‌(సీఆర్‌ఆర్‌ఐ) ఓఆర్‌ఆర్‌ రోడ్డు ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. 30 నుంచి 50 శాతం కార్లు, 7 శాతం లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌, 1 శాతం భారీ ట్రక్కులు నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువ వేగంతో గాల్లో దూసుకెళ్తున్నట్లు తేల్చారు. ప్రమాదాలు చోటు చేసుకునేందుకు అవకాశమున్న 29 ప్రాంతాలను గుర్తించింది. వేగానికి కళ్లెం వేసేలా కర్వ్‌లు, గ్రాండెంట్‌ సెక్షన్లు, ట్రాన్స్‌వర్స్‌ బార్‌ మార్కింగ్‌, మీడియన్‌ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్‌ మార్క్‌లు, స్పీడ్‌ అరెస్టర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. పైనుంచి వాహనాలు కింద పడకుండా ‘టిపికల్‌ డబుల్‌ మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బ్యారియర్స్‌’ను తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. మార్కింగ్స్‌, హెచ్చరికలు రాత్రిపూట కనిపించేలా ఏర్పాట్లు చేయాలని, ఓఆర్‌ఆర్‌ నిర్వహణపై కూడా దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ఈ నివేదిక కాగితాలకే పరిమితమైంది. ఒకటి, రెండు మినహా మిగిలిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details