ఇంజినీరింగ్ కళాశాలల రుసుముల ఖరారు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. తాత్కాలికంగా సుమారు 15 నుంచి 20 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఇప్పటికే అంగీకరించింది. హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా భారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతి పొందిన కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ చర్చలు జరుపుతోంది. నిన్న సుమారు ఇరవై కాలేజీల యాజమాన్యాలతో చర్చించి... పెంపుపై రాత పూర్వకంగా హామీ తీసుకుంది. ఇవాళ, రేపు మరికొన్ని కళాశాలలతో మాట్లాడి ఫీజులు ఖరారు చేయనుంది. సుమారు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 4న ఉత్తర్వులు!
కోర్టుకు వెళ్లని సుమారు 108 కాలేజీల యాజమాన్యాలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. పెంపుతో కలిసి ప్రతిపాదిత ఫీజు 50వేల లోపు ఉంటే... ప్రస్తుత రుసుముపై 20 శాతం తాత్కాలికంగా పెంచేందుకు ఏఎఫ్ఆర్సీ అంగీకరించింది. పెంపుతో కలిసి ప్రతిపాదిత ఫీజు 50వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఇప్పటి వరకు ఉన్న ఫీజుపై 15 శాతం తాత్కాలికంగా పెంచాలని నిర్ణయించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అన్నీ కలిపి ఈనెల 4న సర్కారు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈనెల 5 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉన్నందున ఫీజుల వ్యవహారం కొలిక్కి తెచ్చేందుకు టీఏఎఫ్ఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసింది.