తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంతియాను తొలగించండి: రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు

పీసీసీలో కీలక మార్పులు చేయాలని, కుంతియాను ఇంఛార్జిగా తొలగించాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు, ఎమ్మెల్యేలతో రాహుల్ సమావేశమై అసెంబ్లీ ఎన్నికల ఓటమి కారణాలను తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు.

దిల్లీలో టీకాంగ్రెస్​ నేతలు

By

Published : Feb 6, 2019, 5:22 AM IST

Updated : Feb 6, 2019, 6:18 AM IST

టీకాంగ్రెస్​ నేతలతో రాహుల్​ భేటీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో రాహుల్​ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై నేతలను ప్రశ్నించారు. ఈవీఎంలు, ధన ప్రవాహం, అధికార దుర్వినియోగంతో నష్టపోయామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రాహుల్​కు వివరించారు. కీలక సమయంలో నాయకత్వ లోపం ఎక్కువగా ఉందని, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను వెంటనే మార్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు రాహుల్​కు విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు పూర్తి చేసి ముందుకు వెళ్తేనే ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉందని నేతలు రాహుల్​కు తెలిపారు. పీసీసీ కార్యవర్గాన్ని అధ్యక్షునితో సహా సమూలంగా మార్పులు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు, నేతలు రాహుల్​ని కోరినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలపై నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని కుంతియా తెలిపారు.

శాసన సభ ఎన్నికల్లో ఓటమికి కుంగిపోకుండా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొత్తులపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని.. రాష్ట్రంలో పీసీసీ నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారని పేర్కొన్నారు.

పార్టీ నేతలను సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు మూడు రోజల్లో మరోసారి పీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీఎల్పీలతో సమావేశం కానున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు.

Last Updated : Feb 6, 2019, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details