మొక్కల పెంపకమే శ్వాసగా.. వనాల సంరక్షణే జీవితాశయంగా ఐదేళ్ల ప్రాయం నుంచీ 70 ఏళ్ల వృద్దాప్యం వరకూ ప్రస్థానం సాగిస్తున్న ప్రకృతి ప్రేమికుడు, వనజీవి, పద్మశ్రీ దరిపెల్లి రామయ్యకు అరుదైన గుర్తింపు దక్కింది. కోటి మొక్కలకు ప్రాణం పోసిన రామయ్య చరిత్ర భావితరాలకు పాఠ్యాంశమైంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి సాఁఘిక శాస్త్రంలో పచ్చదనం పేరుతో ప్రచురితమైంది.
అరుదైన గౌరవం
పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ.. మొక్కల పెంపకం, వాటి సంరక్షణలో రామయ్య చూపుతున్న శ్రద్ధను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. తన జీవితాశయాన్ని భావితరాలకు అందించడంపై వనజీవి సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతి రక్షణే ఆరోప్రాణంగా భావించే రామయ్య జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చడం ఖమ్మం జిల్లావాసులకు గర్వకారణమని ఉపాధ్యాయులు, మేధావులు కొనియాడుతున్నారు.
మానే మనం... వనమే జనమంటూ ఏటా విత్తనాలు సేకరించి వాటిని గుట్టలు, అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో విత్తుతూ ఎన్నో వృక్షాలకు ప్రాణం పోశాడు రామయ్య. ఈ ఏడాది ఇప్పటి వరకు 60 కిలోల ఎర్రచందనం విత్తనాలతో పాటు సుమారు క్వింటా వరకూ వివిధ రకాల విత్తనాలు సేకరించారు. వాటిని విత్తేందుకు సిద్ధమవుతున్నారు.
భావితరాలకు పచ్చదనం అందించేందుకు ప్రతి మొక్కను ప్రాణమున్న మనిషిలా సాకి పెంచి పెద్దచేసే బాధ్యతను ప్రతిఒక్కరు పాటించాలంటారు రామయ్య. ఇలాంటి వ్యక్తి జీవితాశయం పిల్లలకు పాఠ్యాంశంగా అందించడం అభినందనీయం.
వనజీవి ఆశయం.. పిల్లలకు పాఠ్యాంశం.. ఇదీ చూడండి: ఇన్నాళ్లు విద్యా, ఉద్యోగాలకు నోచుకోలేదు: బీఎస్ రాములు