Pre Fabricated Houses In Adilabad : గిరిజనులు ఎక్కువగా తమ ఇళ్లను తాటాకులు, వెదురు కర్రలతో నిర్మించుకొని.. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి జీవనం ఎంతో ప్రమాదకరంగా ఉంటూ.. నిత్యం ఏదో ఒక విపత్తుతో యుద్ధం చేస్తూనే ఉంటారు. వర్షాలు పడితే చాలు ఆ పురిగుడెసెలు వర్షపు నీటితో నిండిపోతాయి. ఈ బాధల నుంచి బయటపడి ఇంటి నిర్మాణం చేసుకోవాలన్న.. అది వారి వ్యయప్రయాసలకు ఎంతో దూరంగా ఉంటుంది.
ఒక చిన్నపాటి ఇనుప రేకులతో నిర్మించిన ఇంటికే ఈరోజుల్లో కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అలాంటిది గిరిపుత్రులకు గృహ నిర్మాణం అంటే.. వారి తలకు మించిన భారంగానే చెప్పవచ్చు. ఎందుకంటే తినడానికి తిండి సరిగ్గా దొరక్కా బతుకు జీవుడా అంటూ ఆదివాసీలు అరణ్యాలలో నివసిస్తారు. వీరి బాధలను చూసి గతంలో కుమురం భీం జిల్లా అడిషినల్ కలెక్టర్గా పని చేసిన వరుణ్ రెడ్డి ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారు. వారికి మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.
Pre Fabricated Houses For Tribal People In Adilabad : అందుకే తాను శిక్షణ తీసుకున్న వేర్వేరు రాష్ట్రాల్లో గృహ నిర్మాణ శైలులను గమనించి.. చివరికి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానమే ఉత్తమ విధానం అని వరుణ్ రెడ్డి గ్రహించారు. ఆ విధానం తనను ఆకట్టుకోవడంతో ఆ ఆలోచనలను అప్పటి కలెక్టర్ రాహుల్రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా కలెక్టర్కు బాగా నచ్చి.. ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజినీర్లతో సర్వే చేయించారు. దీంతో ఆ నిర్మాణాలపై ఓ కొలిక్కి వచ్చారు. ఇది అద్భుతమైన నిర్మాణమని.. లాభాలే కానీ ఇందులో నష్టాలు లేవని గ్రహించి కుమురం భీం జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్నారు. అందుకు తగ్గట్టే తిర్మాణిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కెరమెరి మండలం శివగూడ తండాల్లో ఇల్లు నిర్మించారు. ఇందుకు ఆ గిరిజన ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఫ్యాబ్రికేటెడ్ ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుపుతారు : ఈ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణంలో ఒక్కో ఇంటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతారు. మొట్టమొదట సిమెంట్ మిశ్రమంతో తయారు చేసిన 75 ఎంఎం మందం గల ఏరోకాన్ ప్యానళ్లను అమరుస్తారు. 75 ఎంఎం రాడ్లు అంటే మూడు అంగుళాలు మందం ఉన్నవి. ఆ తర్వాత టాటా ఏరోనాటికల్ షీట్స్ వారి సాయం తీసుకొని.. పైకప్పు రేకుల ద్వారా వేసవిలో వేడి నుంచి రక్షణ పొందేందుకు పాల్ సీలింగ్ వేయిస్తున్నారు. టైల్స్ ఫ్లోరింగ్, లప్పం, విద్యుత్, నల్లాలు,రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే ఒక కుటుంబం నివసించడానికి ఉండే ఇళ్లు.. కేవలం రూ.3 లక్షలకే సిద్ధం. ఇలా నిర్మించిన ఇళ్లు 25 ఏళ్లు పాటు మన్నికలో ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నాయి.