Mlc Election Voting: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్- ఉట్నూర్‌లో, నిర్మల్ జిల్లాలో నిర్మల్- భైంసాలో, కుమురంభీం జిల్లాలో ఆసిఫాబాద్- కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల- బెల్లంపల్లి పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ డివిజన్‌కు సంబంధించిన ఓటర్లు ఆ డివిజన్ పరిధిలోనే ఓటు వేయాల్సి ఉంటుంది.
ఓటు ఎలా వేయాలి...
ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన దాని ప్రకారం పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఊదారంగు స్కెచ్‌పెన్‌తో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గదిలో ప్రాధాన్యత క్రమంలో భాగంగా (1), (2) నంబర్లు వేయాలి. ఇందులో ముందుగా మొదటి ప్రాధాన్యత ఓటు(1) వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే చెల్లుబాటు కాదు.బ్యాలెట్ పత్రంపై ఒకటి, రెండు అని అక్షరాల్లో రాసినా ఓటు పనికిరాకుండా పోతోంది. ఓటు చెల్లాలంటే అభ్యర్థి ఎంపిక చేసే అభ్యర్థి ఎవరైనప్పటికీ (1) నంబర్‌ను తప్పక వేయాల్సిందే. (1) నంబర్ వేయకుండా కేవలం (2) నంబర్ మాత్రమే వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. వేసే నంబర్లు కూడా అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉండే గది మధ్యలోనే వేయాలి. పెన్సిల్/పెన్నుతో నంబర్లు వేయకూడదనేది నిబంధన.
నంబర్లకు బదులు అభ్యర్థి పేర్లు రాసినా, రైట్‌మార్కు, ఇంటూ మార్కు వేసినా ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఎలాంటి గీతలు, రాతలు రాయరాదు. పోలింగ్ అధికారి మలచినట్లు మలిచి బాక్సులో వేయాలి. పోలింగ్ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో ఓటింగ్ సరళిని పర్యవేక్షణ, పరిశీలన, నిర్వహణ కోసం 12 మంది జోనల్ అధికారులు, మరో 12 మంది మైక్రో ఆబ్జర్వర్లతోపాటు 40 మంది సిబ్బందిని యంత్రాంగం నియమించింది.
బ్యాలెట్ నమూనా ఇలా...
Mlc Election Voting: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యతకు అనుగుణంగా నిబంధనలకు లోబడి ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పత్రాన్ని తయారు చేస్తుంది. వందమంది కంటే ఎక్కువ ఓటర్లుండే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓ ప్రిసైడిండ్ అధికారి, ముగ్గురు పోలింగ్ సిబ్బంది ఉంటారు. వందమంది ఓటర్లకంటే తక్కువగా ఉంటే ఓ ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ సిబ్బంది ఉంటారు.
కోటా నిర్ణయం ప్రకారం లెక్కింపు...
Mlc Election Voting Quota: కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన కోటా సూత్రీకరణ ప్రకారం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దీని ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో వాల్యూడ్ సంఖ్య/ ఎన్నుకోబడే అభ్యర్థుల సంఖ్య+1+1 అనే ఎన్నికల కమిసన్ నిర్ధేశించిన సూత్రానికి అనుగుణంగా ఓట్లను లెక్కిస్తారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరే అభ్యర్థులు ఉన్నారు. 937 ఓటర్లలో 650 ఓట్లు పోలైతే అందులో 600 ఓట్లే వాల్యూడ్(చెల్లుబాటు) అయ్యాయి అనుకుంటే..? సూత్రీకరణ ప్రకారం 600/2+1+1= లెక్క తీస్తారు. వీటిలో ఏ అనే అభ్యర్థికి 301 ఓట్లు వచ్చి, బీ అనే అభ్యర్థికి 299 ఓట్లు వస్తే సహజంగానే ఏ అనే వ్యక్తిని విజయం సాధించినట్లే. కోటా సూత్రం ప్రకారం పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు ఆపైన ఉంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో జమచేస్తూ లెక్కింపు ఉంటుంది. ఒకవేళ ఇద్దరే అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎలిమినేషన్ పద్ధతికి ఆస్కారం లేదనేది అధికారుల వివరణ. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే మాత్రం లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:MLC ELECTIONS 2021: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీల క్యాంప్ రాజకీయాలు