తెలంగాణ

telangana

ETV Bharat / state

మోడువారిన జీవనం... కట్టెల 'మోపు' పైనే భారం - ఆదిలాబాద్​లో కట్టెలు మోస్తున్న వృద్ధురాలు

వృద్ధాప్యంలోనూ స్వాభిమానంతో జీవించాలనుకుంది. కన్నకొడుకుకు భారం కాకూడదనుకుంది. మంచం పట్టిన కట్టుకున్నవాణ్ని కన్నకొడుకులాగా చూసుకుంటోంది. కట్టుకున్నవాడి కోసం కట్టెలు మోసి కూడబెడుతోంది ఆ ఇల్లాలు. తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది అరవై ఏళ్ల వృద్ధురాలు హరీమున్నీసా.

old lady is taking care of her husband by selling Firewood even in her sixties in adilabad district
మోడువారిన జీవనం... 'మోపు' పైనే భారం...

By

Published : Dec 23, 2019, 3:17 PM IST

మోడువారిన జీవనం... 'మోపు' పైనే భారం...

జీవితంలోని ప్రతి అంకంలో భర్తకు తోడుగా ఉంటానన్న పెళ్లినాటి ప్రమాణాల్ని నిలబెట్టుకుంటోంది ఈ వృద్ధురాలు. ప్రమాదానికి గురై మంచం పట్టిన అరవై ఐదేళ్ల భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇల్లు గడవడానికి ఆరుపదుల వయసులోనూ అహర్నిశలు కష్టపడుతోంది.

అనారోగ్యాన్ని లెక్కచేయకుండా..

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రం సమీపంలోని రామ్​నగర్​లో హరీమున్నీసా, అబ్దుల్​ జమీల్​ దంపతులు నివాసముంటున్నారు. నెలరోజుల క్రితం అబ్దుల్​ ప్రమాదానికి గురై మంచం పట్టాడు. అతనికి కళ్లు సైతం అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. హరీమున్నీసా కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్నాళ్లుగా బాధపడుతోంది.

భారం కాలేదు

ఈ దంపతులకు ఇద్దరు కుమారులుండగా... చిన్న కొడుకు కాలేయవ్యాధితో మరణించాడు. పెద్ద కుమారుడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కొడుకుకు భారం కాకూడదనుకుంది ఆ తల్లి.

ప్రతిరోజు 20 కిలోమీటర్లు నడిచి

రోజు ఉదయం 5 గంటలకు లేచి 20 కిలోమీటర్లకుపైగా దూరం కాలినడకన వెళ్లి అడవిలో ఎండిన కట్టెలను పోగు చేస్తుంది. మోపుగా చేసుకున్న కట్టెలను తలపై పెట్టుకుని తిరిగి ఆదిలాబాద్​ పట్టణంలో విక్రయిస్తుంది. ఆ డబ్బుతో మోడు వారిన వారి బతకు బండిని నడుపుతోంది.

స్వాభిమానం

ఆరుపదుల వయస్సులో... ఎవ్వరి మీదా ఆధారపడకుండా.. కట్టుకున్న వాడికి సపర్యలు చేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది హరీమున్నీసా. వృద్ధాప్యంలోనూ సాయం కోసం చేయిచాచకుండా స్వాభిమానంతో బతుకుతున్న ఈ వృద్ధురాలికి ప్రభుత్వం చొరవ చూపి సాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details