తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: ఆదిలాబాద్​ జిల్లా ప్రజల రాత మారేదెప్పుడు...? - పురపోరు

తమ ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనించాలి... తమకు మౌలిక సౌకర్యాలు చేకూరాలి. ప్రతీ ఎన్నికల్లో ఓటర్లు ఇవే కోరుకుంటారు. హామీల మంత్రాలతో అభ్యర్థులు మాయ చేస్తారు. కానీ... ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల స్థాయి పెరిగిందే తప్ప... దానికనుగుణంగా ప్రగతి మాత్రం కనిపించడంలేదు.

ఆదిలాబాద్​ ప్రజల రాత మారేదెప్పుడు...?
Adilabad ready for municipal elections 2020

By

Published : Jan 9, 2020, 12:37 PM IST

Updated : Jan 10, 2020, 3:03 PM IST

ఆదిలాబాద్​ ప్రజల రాత మారేదెప్పుడు...?

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్. దేశంలో ఎన్నికలు ప్రారంభమైన 1952 నుంచే ఇక్కడ ఎన్నికల నిర్వహణ మొదలైంది. తొలుత గ్రేడ్‌-3గా ఉన్న ఈ పురపాలిక ఇప్పుడు గ్రేడ్‌-1 స్థాయికి ఎదిగింది. మొన్నటి వరకు కేవలం 36 వార్డులకే పరిమితమైన మున్సిపాలిటీ 49 వార్డులుగా రూపాంతరం చెందింది. దాదాపు లక్షా 52వేల 968 మంది జనాభా కలిగిన ఈ పట్టణంలో ప్రజలకు ఇంకా మౌళిక వసతులు సమకూరలేదు. డ్రైనేజీ, సెంట్రల్‌ లైటింగ్‌, పుట్‌పాత్‌ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పట్టణాన్ని మధ్యలో విడదీస్తూ రైల్వేలైన్‌ ఉండగా... ఇప్పటికీ ఓవర్ బ్రిడ్జ్‌ నిర్మాణం కాలేదు.

నిర్మల్​లోనూ నిరాశే...!

నిర్మల్‌ మున్సిపాలిటీది కూడా అదే దుస్థితి. 36 వార్డుల నుంచి 42 వార్డులు పెరిగినా పట్టణంలోనూ పెద్దగా ప్రగతి కనిపించటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఆది నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నేతలున్న ఈ నియోజకవర్గంలో ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్నవాళ్లు అరుదుగానే ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీస వసతులైన వీధి దీపాలు, పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కనిపిస్తోంది.

నేతలు ఎదిగారు కానీ...?

నిర్మల్‌ జిల్లా పరిధిలోకే వచ్చే భైంసా 1953లో పురపాలికగా ఏర్పడి ఇప్పుడు 26 వార్డులకు ఎదిగింది. కానీ పట్టణ అభివృద్ధిలో పెద్దగా మార్పు రాలేదు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా... ఇక్కడి నేతలు ఎదుగుతున్నారే తప్ప స్థానిక సమస్యలను గుర్తించడంలేదని స్థానికుల నుంచి బలమైన విమర్శ వినిపిస్తోంది.

న్నపురాశిలో అభివృద్ధి జరిగేనా...?

నిర్మల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే ఖానాపూర్‌ ఇటీవలే మున్సిపాల్టీగా మారింది. అన్నపురాసిగా ప్రసిద్ధి చెందిన ఖానాపూర్‌ కాలక్రమంలో ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఇటీవల 12 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడిన ఖానాపూర్​... ఏమేరకు అభివృద్ధి జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

పురపాలికల్లో కీలకమైన తాగు నీరు, విద్యుత్‌దీపాలు, పారిశుద్ధ్యం, రహదారులపై దృష్టిసారిస్తే... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బాధలు తీరినట్లేననేది ప్రజల అభిప్రాయం. వచ్చే పాలకవర్గాలు ఆ దిశగా కృషి చేసి తమ పట్టణాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాయని ఆశిస్తున్నారు.

Last Updated : Jan 10, 2020, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details