మనుబాకర్.. రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో వరుస స్వర్ణాలు గెలుస్తూ.. సత్తాచాటుతోంది. డిసెంబరులో జరిగిన 63వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు గెలిచిన ఈ షూటర్.. టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా కృషిచేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మను.. విశ్వక్రీడల్లో స్వర్ణం నెగ్గినా.. తన ఆకలి తీరదని తెలిపింది.
"దేశం గర్వపడేలా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తా. ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గినా.. నా ఆకలి తీరదు. నేను షూటింగ్ చేసినంత కాలం ఇది ఇలాగే కొనసాగుతుంది. ఈ ఏడాదే విశ్వక్రీడలు ఉన్నాయి కాబట్టి నా ట్రైనింగ్‌పై మరింత దృష్టిపెట్టా. ఇందుకోసం ఎంతో ఉత్కంఠగా ఉంది.. ఓ పక్క భయంగానూ ఉంది. నేను షూటింగ్ మొదలు పెట్టినప్పుడు ఇంత ఎత్తుకు ఎదుగుతానని అనుకోలేదు. మంచి ప్రదర్శన చేసి ఈ స్థితికి వచ్చా" - మనుబాకర్, భారత షూటర్.
ఇటీవలే జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు గెలిచింది మను. అంతకుముందు కామన్వెల్త్, యూత్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి కైవసం చేసుకుంది. మహిళల జూనియర్(243 పాయింట్లు), సీనియర్(241) రెండు విభాగాల్లో బంగారు పతకాలు గెలవడం విశేషం.
"చదువు, ప్రాక్టీస్ రెండింటిని సమన్వయం చేసుకుంటూ సాగుతున్నా. అదేవిధంగా మానసికంగా కాకుండా ఫిజికల్‌గానూ శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం ప్రతిరోజు నా లైఫ్‌స్టైల్ ట్రైనింగ్‌తోనే సరిపోతుంది. మొదట్లో షూటింగ్ నా హాబీ. ప్రస్తుతం అది లేకుండా ఉండలేకపోతున్నా. ప్రతిరోజూ షూటింగ్ చేస్తున్నా. చేస్తూనే ఉంటా. అంతగా ఇష్టం పెరిగిపోయింది." - మనుబాకర్, భారత షూటర్.
ప్రస్తుతం భారత షూటర్లందరూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని చెప్పింది మను.