టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా పునరాగమనం ఇప్పుడిప్పుడే జరిగేలా కనిపించడం లేదు. గాయం, ఆ తర్వాత డోపింగ్ కారణంగా ఏడాదికి పైగా జట్టుకు దూరమైన పృథ్వీ.. మళ్లీ గాయపడ్డాడు.
ముంబయి తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతడి ఎడమ భుజానికి గాయమైంది. పృథ్వీ షా భుజంలో చీలిక ఉందని, అతడు చెయ్యి కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడని ముంబయి జట్టు మేనేజర్ అజింక్య నాయక్ చెప్పాడు.
"పృథ్వీ షాను ఎన్‌సీఏకు పంపించాలని బీసీసీఐ నుంచి ముంబయి క్రికెట్ సంఘానికి ఈమెయిల్ వచ్చింది. ఈ కారణంగా అతను బెంగళూరు వెళ్లాడు. గాయం తీవ్రతపై ఎన్‌సీఏలో పూర్తి స్పష్టత వస్తుంది’" అని నాయక్ తెలిపాడు. న్యూజిలాండ్-ఎ జట్టుతో సిరీస్ కోసం భారత-ఎ జట్టుకు ఎంపికైన యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఆ సిరీస్ ఆడటం సందేహమే. వచ్చే శుక్రవారం భారత- ఎ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లనుంది.
ఇదీ చదవండి: ప్రివ్యూ: శ్రీలంకతో భారత్ ఢీ.. బుమ్రాపైనే అందరి దృష్టి