తెలంగాణ

telangana

ETV Bharat / sports

సవాళ్లకు పంచ్.. బాక్సింగ్​లో దీపక్​ మెరుపులు

జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడు బాక్సింగ్​ను వదిలిపెట్టి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకున్నాడు. తనకెంతో ఇష్టమైన ఆటకు దూరం బతుకు ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే.. మనం ఇప్పుడు ఇలా అతని గురించి చెప్పుకునేవాళ్లం కాదు. కోచ్ సహకారంతో బాక్సింగ్​లోనే కొనసాగి... ఉత్తమ బాక్సర్ గా ఎదిగే దిశగా అతనిప్పుడు సాగుతున్నాడు. ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత జోరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేసి సంచలన విజయం సాధిం చాడు. అతనే.. 23 ఏళ్ల దీపక్ కుమార్ భోరియా. జీవితంలోని సవాళ్లకు పంచ్ విసురుతూ సాగుతున్నాడీ హరియాణా బాక్సర్.

By

Published : Mar 1, 2021, 9:02 AM IST

SPECIAL STORY ON BOXER DEEPAK KUMAR
సవాళ్లకు పంచ్.. బాక్సింగ్​లో మెరుస్తున్న దీపక్​ కుమార్

పేద కుటుంబం.. కెరీర్ ఆరంభంలోనే గాయం. తొలి సీనియర్​ జాతీయ ఛాంపియన్​షిప్ మొదటి బౌట్లోనే నాకౌట్ ఓటమి.. ఇలా ఎన్నో అడ్డంకులు తనను వెనక్కి లాగాలని ప్రయత్నించినా దీపక్ పట్టు వదల్లేదు. రింగ్ దాటి బయటకు రాలేదు. సవాళ్లు ఎదురైనా ప్రతి సారి అత్యుత్తమ రీతిలో స్పందించాడు. కష్టాలను దాటి కలల దారిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పదకొండేళ్ల వయసులోనే అతనికి బాక్సింగ్​పై ప్రేమ కలిగింది. చేతులకు గ్లోవ్స్ వేసుకుని... ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాలనే కోరిక ఏర్పడింది. కానీ తన ఆర్థిక పరిస్థితి అడ్డుగా మారింది. అయినప్పటికీ కోచ్ షెరోన్ కారణంగా అప్పుడప్పుడూ బాక్సింగ్​లో సాధన చేసే వీలు కలిగింది. కానీ 15 ఏళ్లు వచ్చేసరికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ప్రాక్టీస్ చేయడం కష్టమైంది. నొప్పులతో శరీరం బాక్సింగ్ శిక్షణకు సహకరించలేదు. దీంతో ఆటను వదిలేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడు. కానీ అతనిలోని బాక్సింగ్​ ప్రతిభను గుర్తించిన షెరోన్.. తనను వదల్లేదు. స్నేహితుల సాయంతో డబ్బు సమకూర్చి మంచి ఆహారం అందేలా చూశాడు. రుణం తీసుకుని మరీ తన శిక్షణ కొనసాగేలా చూశాడు. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయని దీపక్ అంచెలంచెలుగా ఎదిగాడు.

దీపక్ కుమార్

"గడిచిన కొన్ని రోజుల్లో కల నిజమైనట్లుగా అనిపించింది. ప్రపంచంలోని కఠినమైన బాక్సింగ్ టోర్నీల్లో ఒకటైన స్ట్రాంజా స్మారక పోటీల్లో ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్ జోరోవ్​ను ఓడించడం.. ఆ తర్వాత రజతం సొంతం చేసుకోవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. కానీ బాక్సింగ్ నాకు అన్నీ ఇచ్చింది. ఇకపై స్వర్ణాలు గెలవడం పైనే నా దృష్టి. శ్రమ, అంకితభావంతో ఏదైనా సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం నాకుంది."

- దీపక్ కుమార్ భోరియా, బాక్సర్

సహజంగానే:

మొదట్లో బాక్సింగ్ అంటే ఏమిటో కూడా తెలియని దీపక్ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అందుకు అతని తపన, పట్టుదల, సహజ సిద్ధంగా అబ్బిన ప్రతిభ ముఖ్య కారణాలు. రింగ్​లో వేగంగా కదలడం, ప్రత్యర్థిని దెబ్బకొట్టడం, తొందరగా స్పందించడం లాంటి నైపుణ్యాలు తనకు సహజంగానే వచ్చాయి. అందుకే చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచాడు.

దీపక్

ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగుతున్న అతని ప్రయాణంలో.. 2011లో తన కెరీర్​నే ప్రమాదంలో పెట్టే గాయం ఎదురైంది. పట్టుదలతో దాని నుంచి బయటపడ్డ అతనికి.. తన తొలి సీనియర్​ జాతీయ బాక్సింగ్ (2017లో విశాఖపట్నంలో) ఛాంపియన్​షిప్​ తొలిరౌండ్​లోనే నాకౌట్​ ఓటమి పలకరించింది. అయినా అతను కుంగిపోలేదు. మరింత శ్రమించి ఆటను మెరుగుపర్చుకున్నాడు. మానసికంగా బలంగా సిద్ధమయ్యాడు. అదే ఏడాది అగ్రశ్రేణి బాక్సర్ అమిత్ పంగాల్​పై విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

అదే జోరుతో 2018లో జాతీయ ఛాంపియన్​గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ నిలకడ ప్రదర్శిస్తున్నాడు. ఆసియా ఛాంపియన్​షిప్​లో రజతం,థాయ్​లాండ్ ఓపెన్​, మక్రాన్ కప్, ప్రపంచ మిలిటరీ క్రీడల్లో పతకాలు సాధించాడు.

దీపక్

ప్రస్తుతం భారత సైన్యంలో సుబేదార్​గా ఉన్న అతను ఇటీవల స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ పురుషుల 52 కేజీల విభాగం సెమీస్​లో ఇప్పటివరకూ తన కెరీర్​లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జోరోవ్​పై విజయం సాధించాడు. ఆ తర్వాత హోరాహోరీ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ టోర్నీలో అతను చూపించిన తెగువ అందరి మన్ననలు అందుకుంది. ఇదే జోరుతో ఒలింపిక్స్​లో భారత్​కు పతకం అందించాలనే లక్ష్యం వైపు దీపక్ సాగుతున్నాడు.

ఇదీ చూడండి: రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్​

ABOUT THE AUTHOR

...view details