తెలంగాణ

telangana

ETV Bharat / sports

PV Sindhu Rank : పదేళ్లలో లోయస్ట్ ర్యాంక్​.. 17వ స్థానానికి సింధు పతనం

PV Sindhu BWF Rank : భారత స్టార్ షట్లర్​ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్​ పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది.

pv sindhu bwf rank
pv sindhu

By

Published : Jul 18, 2023, 5:09 PM IST

Updated : Jul 18, 2023, 6:48 PM IST

PV Sindhu BWF Rank : భారత స్టార్ షట్లర్​ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్​ పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. ప్రస్తుతం తన వద్ద 14 టోర్నమెంట్స్​కు గాను 49,480 పాయింట్లు ఉన్నాయి.

గతేడాది కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా సత్తా చాటలేకపోతోంది. వరుస టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో సింధు చోటు కోల్పోయింది. స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 టోర్నీలో ఫైనల్‌ చేరుకోవడం మినహా ఈ సీజన్‌లో సింధు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు.

PV Sindhu Career : 2016లో ప్రపంచ నంబర్ 2కి చేరుకున్న సింధు.. 2016 నుంచి టాప్ 10లోనే కొనసాగుతోంది. అయితే ఇప్పటి ర్యాంకింగ్స్​ను చూసుకుంటే ఈ దశాబ్ద కాలంలో ఆమె సాధించిన ర్యాంకింగ్​లో ఇదే అత్యల్పమైనది. సింధు చివరిసారిగా 2013లో 17వ ర్యాంక్‌ను సాధించింది. రానున్న మ్యాచ్​ల కోసం ఆమె ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్, ఇండోనేషియా కోచ్ ముహమ్మద్ హఫీజ్ హషీమ్ వద్ద శిక్షణ పొందనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనున్న ఒలింపిక్ క్వాలిఫికేషన్ సమయానికల్లా ఆమె మళ్లీ ఫామ్​లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరుకున్న సింధు.. ఆ గేమ్​లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. ఇక ఆమె మలేషియా మాస్టర్స్​తో పాటు కెనడా ఓపెన్‌లలో సెమీఫైనల్స్​ వరకు చేరుకున్న సింధు.. యూఎస్​ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ నిష్క్రమించింది. ప్రస్తుతం సింధు సూపర్ 500 టోర్నమెంట్ కోసం కొరియాలో ఉంది. మరోవైపు సీనియర్​ స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్ కూడా ఐదు స్థానాలు దిగి.. ప్రపంచ 36వ ర్యాంక్‌కు చేరుకుంది.

టాప్​ 25లో భారతీయులు లేరా ?
ఇక పురుషుల ర్యాంకింగ్స్​లో భారత స్టార్​ షట్లర్​ హెచ్​ ఎస్​ ప్రణయ్​.. 10వ స్థానానికి పడిపోగా.. లక్ష్యసేన్​తో పాటు కిదాంబి శ్రీకాంత్ వరుసగా 12, 20వ స్థానాల్లో నిలదొక్కుకున్నారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ప్రపంచ 3వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ తో పాటు గాయత్రి గోపీచంద్ కూడా ఒక స్థానాన్ని కోల్పోయి 19వ స్థానానికి చేరుకున్నారు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో టాప్ 25 స్థానాల్లో భారతీయులెవరూ లేరు.

Last Updated : Jul 18, 2023, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details