తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 7:01 AM IST

Updated : Dec 26, 2019, 12:01 PM IST

ETV Bharat / sports

రివ్యూ 2019 : క్రీడల్లో సరికొత్త శిఖరాలకు భారత్​

2019లో భారత క్రీడాకారులు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించారు. ఇప్పటి వరకు క్రికెట్​కే పట్టం కట్టిన భారతీయులు ఇతర క్రీడలనూ ఆదిరిస్తున్నారు. ఆయా రంగాల క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చారు.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
రివ్యూ 2019 : క్రీడల్లో సరికొత్త శిఖరాలకు భారత్​

క్రికెట్​... భారతదేశంలో దాదాపు ఏ టీవీలో చూసినా కనిపించేది ఇదే. ప్రపంచకప్​ నుంచి ద్వైపాక్షిక సిరీస్​ల వరకూ ప్రత్యేక ప్రమోషన్లు అవసరం లేకుండానే 'మెన్ ఇన్​ బ్లూ' జట్టు ఆడే ప్రతి మ్యాచ్​కూ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. అయితే క్రికెట్​ను ఇంతలా ఆదరిస్తోన్న భారతీయులు ఇతర క్రీడలను మాత్రం అంతగా పట్టించుకోరనే మాట కాస్త కఠినమైనదే అయినా ఇప్పటి వరకు అది వాస్తవమే. ఫుట్​బాల్​, బ్యాడ్మింటన్​, టెన్నిస్​, బాక్సింగ్​, రెజ్లింగ్​ తదితర ఆటలకు దేశంలో ఆదరణ చాలా తక్కువ.

కానీ '2019' మాత్రం ఇందుకు భిన్నం. క్రికెట్​తో పాటు ఇతర క్రీడాకారులకు ఈ ఏడాదిబాగా గుర్తుండిపోనుంది. పీవీ సింధు, మేరీ కోమ్​, మానసి జోషి, భజరంగ్ పునియా తదితర క్రీడాకారులు ఆయా రంగాల్లో ప్రపంచ వేదికలపై మెరిసి.. భారత ప్రేక్షకుల మనసులను తమవైపు తిప్పుకున్నారు. క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకూ ప్రేక్షకాదరణ చూరగొన్నారు.

బ్యాడ్మింటన్​

2019లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం​ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ప్రపంచ పారా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ షిప్​లో మానసి జోషి కూడా బంగార పతకాన్ని కైవసం చేసుకుంది.

పీవీ సింధు

సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ద్వయం 'థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​ 500' టైటిల్​ విజేతగా నిలిచింది. ఫ్రెంచ్​ ఓపెన్​ 750 టైటిల్​లోనూ ఫైనల్​ వరకూ వెళ్లింది. 36 ఏళ్ల నిరీక్షణకు చెక్​ పెడుతూ స్విట్జర్లాండ్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్ పురుషుల సింగిల్స్​​లో సాయి ప్రణీత్​ కాంస్య పతకం సాధించాడు. 1983లో ప్రకాశ్​ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. వీరితో పాటు 18 ఏళ్ల లక్ష్యసేన్​ కూడా ఈ ఏడాది ఏకంగా 5 పతకాలు సాధించి అందరినీ ఆకర్షించాడు.

టెన్నిస్​

ఈ ఏడాది యూఎస్​ ఓపెన్​ సందర్భంగా సుమిత్​ నాగల్​-రోజర్​ ఫెదరర్​ మధ్య జరిగిన మ్యాచ్ భారతీయులందరికీ గుర్తుండిపోతుంది​. ప్రపంచ మేటి టెన్నిస్​ ప్లేయర్లలో ఒకరైన ఫెదరర్​ను తొలి సెట్లోనే ఓడించి ఒక్కసారిగా అందరినీ తనవైపు ఆకర్షించాడు సుమిత్​. చివరకు మ్యాచ్​ ఓడినప్పటికీ ఫెదరర్​కు గట్టిపోటీనిచ్చి.. భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందితో శభాష్​ అనిపించుకున్నాడు. నాగల్​తో పాటు మరికొంత మంది తమ ప్రతిభను కనబర్చారు.

బాక్సింగ్​

మేరీకోమ్​

2019 మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో మేరీ కోమ్​ కాంస్య పతకం నెగ్గింది. అయితే అదే టోర్నీలో మేరీ కోమ్ సెమీఫైనల్ మ్యాచ్​ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోషియేషన్​ అఫీషియల్​ యూట్యూబ్​ ఛానెల్​ 'ఏఐబీఏ'కు ఒక్కసారిగా వీక్షకులు కూడా పెరిగారు. అధికారుల తీరుపై ఆమె ఫిర్యాదు చేసినప్పుడు దేశం మొత్తం మేరీకి బాసటగా నిలిచింది. మరో బాక్సర్​ మంజు రాణి కూడా మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో వెండి పతకాన్ని సాధించింది.

రెజ్లింగ్​

భారత రెజ్లింగ్ క్రీడాకారులకు 2019 మరచిపోలేని ఏడాదిగా మిగిలిపోతుంది. రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో దీపక్​ పునియా వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. వినేశ్ ఫొగట్​, రవి కుమార్​, బజరంగ్​ పూనియా, రాహుల్​ అవారేలు కాంస్య పతకాలు సాధించారు.

వినేశ్ ఫొగాట్​

ఫుట్​బాల్​

అయితే ఫుట్​బాల్​లో మాత్రం భారత్​ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, భారత ప్రేక్షకులు ఇతర క్రీడలతో పాటు ఫుట్​బాల్​ను కూడా ఆదిరించాలన్న భారత ఫుట్​బాల్​ కెప్టెన్​ సునీల్ ఛెత్రీ సందేశంతో 2022 ఫిఫా వరల్డ్​కప్​ క్వాలిఫయింగ్​ మ్యాచులకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

దక్షిణాసియా క్రీడల్లో భారత్​ రికార్డు

2019లో దక్షిణాసియా క్రీడల్లో భారత్​ సరికొత్త చరిత్ర లిఖించింది. 174 బంగారు, 93 వెండి, 45 కాంస్య పతకాలతో చరిత్రలో తొలిసారి అత్యధికంగా 312 పతకాలను ఖాతాలో వేసుకుంది. గతంలో అత్యుత్తుమంగా 309 పతకాలు సాధించింది భారత్​.

భారత ప్రేక్షకులు అంతగా ఆదరించని మార్షల్​ ఆర్ట్స్​ కూడా రితూ ఫొగాట్​ రాకతో ఈ ఏడాది మంచి ఆదరణ పొందింది.

క్రికెట్​

భారత్​లో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్​.. ఈ ఏడాది నూతన శిఖరాలకు చేరింది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో మొదటి స్థానంలో నిలిచింది.

ప్రపంచకప్​లో కివీస్ - ఇంగ్లాండ్

ఈ ఏడాది ఇంగ్లాండ్​, వేల్స్​ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్​ ప్రపంచకప్​లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. సెమీఫైనల్​ వరకు చేరింది. అయితే అనూహ్య రీతిలో సెమీఫైనల్లో న్యూజిలాండ్​ చేతిలో పరాజయం పొంది కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్​ ఆశలను నెరవేర్చలేక పోయింది.

2020లో టోక్యో ఒలింపిక్స్​, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్​, మహిళల టీ20 ప్రపంచకప్​ తదితర మెగా ఈవెంట్లకు రానున్న 2020 ఏడాది వేదిక కానుంది. ఈ తరుణంలో దేశంలో క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటం శుభపరిణామంగా పరిగణించొచ్చు. అలాగే భవిష్యత్​లో భారత్​.. క్రీడాసంపత్తికి కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

Last Updated : Dec 26, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details