Boxer Mohammad Hussamuddin : ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ సెమిస్కు చేరిన ప్రముఖ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు. వైద్యులు సూచన మేరకు సెమీస్ బౌట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు భారత్‌కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు దీపక్ భోరియా, నిశాంత్ దేవ్‌లు కూడా పురుషుల 51, 71 కేజీల విభాగంలో కాంస్యం పతకాలను ముద్దాడారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 51 కేజీల విభాగం సెమీస్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలిచిన ఫ్రాన్స్ బాక్సర్ బిలాల్ బెన్నామాతో జరిగిన పోరులో దీపక్ 3-4 తేడాతో ఓటమిపాలయ్యాడు.
ఇప్పటికే ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించాడు నిజామాబాద్‌కు చెందిన ఈ 29 ఏళ్ల బాక్సర్ హుసాముద్దీన్. శుక్రవారం ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన క్వార్టర్స్ పోరులో హుసాముద్దీన్ గాయపడ్డాడు. ఆ బౌట్‌లో పురుషుల 57 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన జె.డియాజ్ ఇబానెజ్‌తో తలపడుతుండగా.. హుసాముద్దీన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు సెమీఫైనల్ బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.