తెలంగాణ

telangana

Asian Games 2023 : కబడ్డీ ఫైనల్‌.. హైడ్రామాలో టీమ్​ఇండియానే విజయం.. అసలు గొడవేం జరిగిందంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 8:23 PM IST

Asian Games 2023 Kabaddi Controversy : ఆసియా క్రీడల్లో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్​లో హైడ్రామా చోటు చేసుకుని.. దాదాపు గంటపాటు ఆటను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చివరికి భారత్‌ను విజేతగా ప్రకటించి గోల్డ్‌ మెడల్‌ను అందించారు. అసలేం జరిగిందంటే?

Asian Games 2023 : కబడ్డీ ఫైనల్‌.. హైడ్రామాలో టీమ్​ఇండియానే విజయం.. అసలు గొడవేం జరిగిందంటే?
Asian Games 2023 : కబడ్డీ ఫైనల్‌.. హైడ్రామాలో టీమ్​ఇండియానే విజయం.. అసలు గొడవేం జరిగిందంటే?

Asian Games 2023 Kabaddi Controversy :ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు సెంచరీని దాటేసింది. అయితే అందులో పురుషుల కబడ్డీ విభాగంలో గోల్డ్​ మెడల్​ కూడా ఉంది. ఇరాన్‌తో జరిగిన తుది పోరులో భారత్ 33-29 తేడాతో (IND vs IRN Kabaddi) విజయం సాధించి గోల్డ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇరు జట్ల మధ్య మరొక నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందన్న సమయంలో.. తీవ్రమైన హైడ్రామా జరిగింది. పాయింట్ల వద్ద ప్లేయర్స్​ పట్టుపట్టడం వల్ల ఆటను దాదాపు గంటపాటు సస్పెండ్‌ చేశారు. చివరికి సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత భారత్‌ను విజేతగా అనౌన్స్ చేశారు.

వివాదం ప్రారంభమైంది ఇలా.. భారత్ - ఇరాన్‌ ప్లేయర్స్​ మొదటి నుంచి పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించి ఆడారు. అయితే మ్యాచ్‌ ముగియడానికి మరొక 65 సెకన్ల సమయం మాత్రమే ఉందన్న సమయంలో.. భారత్‌ నుంచి కెప్టెన్ పవన్ రైడ్‌కు వెళ్లాడు. డూ ఆర్‌ డై అనే పరిస్థితి ఇది. అయితే పవన్‌ మాత్రం ప్రత్యర్థి ప్లేయర్లను టచ్‌ చేయకుండా లాబీ మీదకు వెళ్లాడు. అతడిని ఆపేందుకు ఇరాన్‌కు చెందిన నలుగురు డిఫెండర్లు కూడా వెళ్లిపోయారు.

దీంతో లాబీ మీదకు ఇరాన్‌ ప్లేయర్స్​ వచ్చినందుకు తమకు పాయింట్లు ఇవ్వాలని భారత్.. ఎవరినీ టచ్‌ చేయకుండా పవనే లాబీపైకి వెళ్లినందుకు అతడిని ఔట్‌గా ప్రకటించాలని ఇరాన్‌.. డిమాండ్​ చేశారు. దీంతో అధికారులకు ఓ సంకట పరిస్థితి ఎదురైంది. భారత్ ప్లేయర్స్​ పాత రూల్స్‌ ప్రకారమే పాయింట్లు కేటాయించాలని డిమాండ్‌ చేయగా.. ఇరాన్‌ మాత్రం కొత్త రూల్స్‌ ప్రకారం తమకు పాయింట్ ఇవ్వాలని పేర్కొంది. ఇరు జట్ల ఆటగాళ్లు వాదోపవాదాలు చేసుకుంటూ మైదానంలోని మ్యాట్‌పైనే కూర్చొండిపోయారు.

అసలు రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌.. ఇంటర్నేషనల్​ కబడ్డీ ఫెడరేషన్‌ రూల్‌ బుక్‌ ప్రకారం.. డిఫెండర్‌ లేదా డిఫెండర్లు ఎవరూ కూడా లాబీ మీదకు రైడర్‌ను తాకకుండా వెళ్లకూడదు. వెళ్తే ప్రత్యర్థికి పాయింట్లు వస్తాయి. అలాగే లాబీ మీద రైడర్‌ను పట్టుకున్నాసరే అతడిని నాటౌట్‌గా పరిగణిస్తారు. ఒకవేళ రైడర్‌... డిఫెండర్లలో ఎవరినీ టచ్‌ చేయకుండా ఆ లాబీ మీదకు వెళ్తే సెల్ఫ్‌ఔట్‌ అవుతాడు. అప్పుడు ప్రత్యర్థికి పాయింట్‌ వస్తుంది. అయితే, ఇలాంటి రూల్‌ డిఫెండింగ్‌ జట్టు విషయంలో సరిగా లేదని భావించిన ప్రో కబడ్డీ లీగ్‌ నిర్వాహకులు .. ఆ రూల్‌ను మార్చుకున్నారు. రైడర్‌ ఎవరైనా సరే అలా లాబీ మీదకు వెళ్తే అక్కడితో అతడిని ఎలిమినేట్‌ చేసేస్తారు. డిఫెండింగ్‌ జట్టుకు ఒక పాయింట్‌ ఇవ్వడం జరుగుతుంది.

భారత్​ అభ్యంతరం.. భారత్‌ - ఇరాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇదే పరిస్థితే ఎదురైంది. రైడింగ్‌పై సమీక్షలు నిర్వహించినప్పటికీ, ఏ రూల్‌ ప్రకారం పాయింట్లను ఇవ్వాలనే దానిపై కుస్తీ పడ్డారు. పాత రూల్‌ ప్రకారం అయితే భారత్‌కు నాలుగైదు పాయింట్లు (డిఫెండర్లను బట్టి) వస్తాయి. కొత్త రూల్​ ప్రకారమైతే ఇరాన్ ఖాతాలో ఒక పాయింట్‌ వస్తుంది. కానీ, మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్లకూ చెరొక పాయింట్‌ ఇచ్చాడు. ఇరాన్‌ ప్లేయర్​ కూడా సెల్ఫ్‌ ఔట్‌ అయినట్లుగా పేర్కొన్నాడు. అప్పుడు ఇరు జట్లూ 29-29కి చేరాయి. దీనిపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఫైనల్​గా పాత రూల్ ప్రకారమే.. కొత్త నిబంధనను అంతర్జాతీయ టోర్నీల్లో అమలు చేయలేదనే విషయాన్ని టీమ్‌ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రో కబడ్డీ సీజన్‌ 9లోనే ఈ రూల్‌ను ఉపయోగించారని పేర్కొంది. అంతర్జాతీయ, ఆసియా కబడ్డీ ఫెడరేషన్లు అంగీకరిస్తేనే నిబంధనలను ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. చివరికి పాత రూల్‌ ప్రకారం భారత్‌కు నాలుగు పాయింట్లు కేటాయించారు. దీంతో భారత్ 33-29 తేడాతో తుదిపోరులో గెలుపొంది గోల్డ్ మెడల్ దక్కించుకుంది.

Neeraj Chopra Asian Games 2023 : మార్పు మొదలైంది.. ఇక వదిలిపెట్టి వెళ్లడం జరగదు.. 'ఈటీవీ భారత్'​తో నీరజ్​ చోప్రా

Asian Games 2023 India Medals : ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో పతకాలు

ABOUT THE AUTHOR

...view details