ఒలింపిక్స్‌లో భారత్ అనగానే గుర్తొచ్చేది హాకీ.. ఎనిమిది స్వర్ణాలు సాధించిన ఘన చరిత్ర భారత్‌ది. పూర్వవైభవం సాధించాలని కలలుగంటున్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి పోరాటం చేయనుంది. ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల పోటీలో శుక్రవారం రష్యాను ఢీకొననుంది. వరుసగా రెండు రోజులు జరిగే ఈ పోరులో గెలిస్తే ఒలింపిక్ బెర్తు సొంతమవుతుంది. భారత మహిళల జట్టుది పురుషుల పరిస్థితే. అమెరికాతో శుక్రవారం ఆరంభమయ్యే రెండు మ్యాచ్‌ల పోరాటంలో గెలిస్తే ఒలింపిక్ బెర్తు సొంతమవుతుంది. అర్హత పోటీలకు భువనేశ్వర్ వేదికగా నిలవనుంది.
తేలికైనా శ్రమించాల్సిందే..
భారత పురుషులు, మహిళల జట్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి అవకాశం.. ప్రపంచ ర్యాంకింగ్‌లో 5వ స్థానంలో ఉన్న భారత పురుషుల జట్టుకు రష్యా (22వ ర్యాంకు) నుంచి పెద్ద ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చు. అయితే రష్యాను తేలిగ్గా తీసుకోమని కోచ్ గ్రాహం రీడ్ అన్నాడు. రీడ్ మార్గనిర్దేశనంలో ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన భారత్.. ఇటీవల బెల్జియంతో సిరీస్‌లో వరుస విజయాలు సాధించింది. కెప్టెన్ మన్‌ప్రీత్‌తో పాటు నీలకంఠశర్మ, సునీల్, మన్‌దీప్, ఆకాశ్‌దీప్ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. మాజీ కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేశ్ అనుభవం జట్టుకు పెద్ద అండ.
జోరు మీద అమ్మాయిలు
ఈ ఏడాది జోరు మీద ఉన్న రాణి రాంపాల్ సారథ్యంలోని భారత అమ్మాయిల జట్టుకు కఠిన పరీక్ష ఎదురు కానుంది. 9వ ర్యాంకులో ఉన్న భారత మహిళల జట్టు.. 13వ ర్యాంకులో ఉన్న యుఎస్‌ఏ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. కానీ ఏడాదిలో రాణి సేన ఎంతో మారింది. లాల్‌రెమ్‌సియామి, దీప్‌గ్రేస్, సలీమా, గుర్జిత్ కౌర్ లాంటి అమ్మాయిల జట్టును బలోపేతం చేశారు.
14 జట్లు.. రెండు అంచెలు
ర్యాంకుల ఆధారంగా డ్రా తీసి 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో తొలి అంచె పోటీలు ఇప్పటికే పూర్తి కాగా పురుషుల విభాగంలో స్పెయిన్, నెదర్లాండ్స్, కెనడా ముందంజ వేశాయి. పాకిస్థాన్, ఐర్లాండ్, ఫ్రాన్స్ ఇంటిముఖం పట్టాయి. ఇక రెండో అంచెకు రంగం సిద్ధమైంది. రష్యాతో భారత్, న్యూజిలాండ్‌తో కొరియా, జర్మనీతో ఆస్ట్రియా, బ్రిటన్‌తో మలేసియా తలపడనున్నాయి.
మహిళల విభాగంలో తొలి అంచెలో గెలిచి ఆస్ట్రేలియా, చైనా, స్పెయిన్ ఒలింపిక్స్ బెర్తు సంపాదించగా, రెండో అంచెలో యుఎస్‌ఏతో భారత్, ఇటలీతో జర్మనీ, బ్రిటన్‌తో చిలీ, కెనడాతో ఐర్లాండ్ పోటీపడనున్నాయి. వీటిలో ఒక్కో జట్టు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. రెండూ గెలిచినా, ఒకటి గెలిచి ఒకటి డ్రా చేసుకున్నా ఒలింపిక్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఒకవేళ చెరో మ్యాచ్ గెలిస్తే గోల్స్ లెక్కల ద్వారా ముందుకెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
ఇవీ చూడండి.. రవిశాస్త్రి సేవలు అందుకోసం వాడుకుంటాం: దాదా