సౌథాంప్టన్ వేదికగా జరుగుతోన్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు(world test championship final) వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు మూడు రోజుల్లో తొలిరోజు పూర్తిగా రద్దవ్వగా.. రెండు, మూడు రోజుల్లో తరచూ వర్షం దోబూచులాడుతూనే ఉంది. ఇప్పుడు నాలుగో రోజూ (జూన్ 21) వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
WTC Final: నాలుగో రోజూ వర్షమే.. మ్యాచ్ జరిగేనా! - cricket news
భారత్-న్యూజిలాండ్(IND VS NZ) మధ్య జరుగుతున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు(world test championship final) వరుణుడు అడ్డుతగులుతూనే ఉన్నాడు. నాలుగో రోజూ అక్కడ వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
సోమవారం సౌథాంప్టన్‌లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. అప్పుడప్పుడు చినుకులు పడతాయని వెల్లడించింది. ఈరోజు అక్కడ గరిష్ఠంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది.
ఇప్పటికే ఈ టెస్టులో న్యూజిలాండ్ పైచేయి సాధించింది! తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేస్తున్న కివీస్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 101/2 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన వెంటనే పిచ్ సహకారాన్ని ఉపయోగించుకుని పేసర్లు రెచ్చిపోతే టీమ్ఇండియా మళ్లీ గాడిన పడొచ్చు.