మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ కేవలం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 1-0 ఆధిక్యంలో టీమ్‌ఇండియా దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లోనే ఓ క్రీడాకారుడు మైదానంలో చెలరేగిపోయాడు. అతనెవరోకాదు యువ ప్లేయర్ శివమ్ మావి నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. అరంగేట్రంలోనే తనదైన శైలిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌గా మావి నిలిచాడు.
లంక ఓపెనర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వికెట్ నాకు చాలా స్పెషల్: టీమ్‌ఇండియా బౌలర్ శివమ్ మావి
శ్రీలంకను ఆలౌట్ చేయడంలో అరంగేట్ర బౌలర్ శివమ్ మావి కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. శ్రీలంక ఓపెనర్ నిస్సాకను క్లీన్ బౌల్డ్ చేసిన వికెట్ తనకు చాలా ప్రత్యేకమని తెలిపాడు.
"నేను బంతిని విడుదల చేసే ప్రదేశం కాస్త జారినట్లు అనిపించింది. అండర్ - 19 క్రికెట్ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు జాతీయ జట్టు కోసం వేచి చూశా. కొన్నిసార్లు గాయాలపాలుకావడం జరిగింది. నా కల అలాగే మిగిలిపోతుందేమోనని కాస్త ఆందోళన చెందా. ఐపీఎల్ ఆడుతూ నా కలను సజీవంగా ఉంచుకొన్నా. పవర్‌ప్లేలో ఎటాకింగ్ బౌలింగ్ వేయాలనేదే నా ప్రణాళిక. ఓపెనర్ నిస్సాకను క్లీన్ బౌల్డ్ చేసిన వికెట్ నాకెంతో ప్రత్యేకం" అని శివమ్ మావి తెలిపాడు.
ఆల్‌రౌండర్ దీపక్ హుడా (41*) కీలకమైన పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకొన్నాడు. నెట్స్‌లోనూ భారీ షాట్ల కోసం ప్రాక్టీస్ చేసేవాడినని, స్పిన్నర్లను ఎలా టార్గెట్ చేయాలనేదానిపై తెలుసనని దీపక్ తెలిపాడు. ఈ విజయంతో భారత్ వేదికగా లంకపై వరుసగా 11వ గెలిచిన జట్టుగా టీమ్‌ఇండియా మారింది.