Rohit Sharma 2023 Stats :మరో 14రోజుల్లో 2023 ముగియనుంది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఈఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు! ఒక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కలిసొచ్చిన అంశం ఒక్కటి లేదు. వ్యక్తిగతంగా కాస్త మెరుగైన ప్రదర్శనే చేసినా కెప్టెన్‌గా మాత్రం విజయాలను అందుకోలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి, ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం వంటి ఘటనలతో రోహిత్ శర్మ మానసిక వేదనకు గురయ్యాడు.
ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు రోహిత్. ఆ తర్వాత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు ముంబయి ఇండియన్స్ జట్టను చేర్చాడు. కానీ క్వాలిఫయిర్లోనే వెనుదిరిగి టైటిల్ అందించలేకపోయాడు.
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఓటమిపాలై త్రుటిలో ఐసీసీ టైటిల్ చేజార్చుకున్నాడు. అనంతరం వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాడు రోహిత్ శర్మ. టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ను జట్టును విజేతగా నిలబెట్టాడు. కొత్త ఆశలు రేకెత్తించాడు.
ఇటీవలే భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ వరుస విజయాలతో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా ఓటమి పాలవ్వడంతో ఒక్కసారిగా ఏడ్చేశాడు. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలు సాధించిన ఫైనల్ చేరిన టీమ్ఇండియాను దురదృష్టం వెంటాడింది. పిచ్ కండిషన్స్ పూర్తిగా ఆసీస్‌కు అనుకూలంగా మారడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.