టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి, గురువారంతో 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ట్విటర్లో #RaviShastri ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అతడి రికార్డులను గుర్తు చేసుకుంటున్నారు. 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శాస్త్రి ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు.
రవిశాస్త్రి కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి 6,938 పరుగులు చేశాడు. 280 వికెట్లు తీశాడు. 1985 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడి ప్రదర్శనలు అద్భుతం. మొత్తంగా 182 పరుగులు చేసి 8 వికెట్లు తీశాడు. అతడి మెరుపుల వల్లే టీమ్‌ఇండియాకు విజ్డెన్ టీమ్ ఆఫ్ ది సెంచరీ టైటిల్ దక్కింది.
ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాక్ మొదట 179/9కి పరిమితమైంది. బంతితో వికెట్ తీసిన శాస్త్రి ఛేదనలోనూ 63 పరుగులు చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ 8 వికెట్ల తేడాతో జట్టుకు విజయం అందించాడు. 1983 ప్రపంచకప్ జట్టులోనూ శాస్త్రి సభ్యుడు. భారత్ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడు ఇతడే.
కోచ్‌గానూ టీమ్‌ఇండియాకు రవిశాస్త్రి అద్భుత విజయాలు అందించాడు. అతడి కోచింగ్‌లో భారత్.. ఆస్ట్రేలియాలో రెండుసార్లు సిరీస్ విజయాలు సాధించింది. విదేశాల్లోనూ రాణించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలచింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. త్వరలో కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది.
రవిభాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మైదానం లోపల, బయట మాకు ఇలాగే ఉత్సాహాన్ని అందించాలి. మీ భవిష్యత్తు బాగుండాలి