ఆరు టీమ్‌లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. ఇలా చేస్తే భారత జట్టు బెంచ్ స్ట్రెంత్‌ను మరింత దృఢంగా చేయొచ్చని తెలిపింది.
టీ20 లీగ్స్‌ను ప్రారంభించాక పురుష జట్టులో క్రికెటర్ల ఆటతీరు మెరుగైందని తెలిపిన మంధాన.. మహిళల జట్టులోను అదే జరుగుతుందని పేర్కొంది. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన ఆమె 10 ఏళ్ల క్రితం ఐపీఎల్ భిన్నంగా ఉండేదని తెలిపింది. మహిళా క్రికెటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ఈ లీగ్ వేదికగా మారాలని ఆశించింది.
బిగ్ బాష్ లీగ్ వల్ల ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆటతీరు మారిందని చెప్పుకొచ్చింది మంధాన. ఈ లీగ్ నిర్వహణతో 40-50 మంది ప్లేయర్లను అంతర్జాతీయ క్రికెట్లో ఆడించేందుకు ఆసీస్ సిద్ధం చేసిందని చెప్పింది. ఈ తరహాలోనే బీసీసీఐ.. మహిళా ఐపీఎల్ నిర్వహించాలని కోరింది.