తెలుగు తేజం, ముంబయి ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ 2022 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టాడు. అరంగేట్ర సీజన్‌లోనే ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో స్థానం సంపాదించాడు. తొలి సీజన్‌ను అద్భుతంగా ముగించి హైదరాబాద్ చేరుకున్న తిలక్ తన అనుభవాన్ని 'ఈనాడు- ఈటీవీ భారత్'తో పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే ఇలా..
ఆల్‌రౌండర్‌గా..:తొలి సీజన్‌లోనే ముంబయిపై ముద్ర వేస్తానని ఊహించలేదు. అసలు అవకాశం లభిస్తుందని కూడా అనుకోలేదు. అలాంటిది 14 మ్యాచ్‌లు ఆడటం.. రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం బాధించింది. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేశా. అందరి సలహాలు, సూచనలను మైదానంలో ఆచరణలో పెట్టా. నా బ్యాటింగ్ గురించి అందరూ సానుకూలంగా మాట్లాడుతుంటే సంతోషంగా అనిపిస్తోంది. తిలక్ టీమ్‌ఇండియాకు ఆడతాడంటూ కెప్టెన్ రోహిత్‌శర్మ, దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతిసారి ఈ మాటల్ని గుర్తుచేసుకునేవాడిని. వచ్చే ఏడాది నా బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. నన్ను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా చూడాలన్నారు. ఆఫ్ స్పిన్నర్‌గా 4 ఓవర్లు వేయిస్తామని చెప్పారు. అప్పుడు అదనంగా మరో బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందని తెలిపారు. టీమ్‌ఇండియా లక్ష్యంగా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మారతా.
దిగ్గజాల పాఠాలు..:సచిన్ తెందుల్కర్, మహేళ జయవర్దనె, జహీర్‌ఖాన్, రోహిత్‌శర్మ.. వీళ్లను టీవీల్లో చూడటమే కానీ ఎప్పుడూ కలవలేదు. వీళ్లందరిని హోటల్‌లో మొదటిసారి చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేరుగా వెళ్లి మాట్లాడేందుకు ధైర్యం సరిపోలేదు. జట్టు సమావేశంలో అందరూ పాల్గొన్నారు. అప్పుడు అందరూ నాతో మాట్లాడారు. దీంతో భయం పోయింది. మైదానంలోనూ వాళ్లంతా అండగా నిలిచారు. ఏ మైదానంలో.. ఏ బౌలర్‌ను ఎలా ఆడాలో నేర్పించారు. సచిన్, జయవర్దనె, జహీర్‌లు నా ఆటకు మరిన్ని మెరుగులు దిద్దారు. ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించడమెలాగో నేర్పారు.