టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఆర్సీబీ, లఖ్‌నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయంతో ఇబ్బంది పడిన అతడు.. ఆ తర్వాత మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. రాహుల్‌కు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో అతడు ఈ మెగాటోర్నీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రికవరీపై దృష్టి పెడతానని తెలిపాడు. అయితే తాజాగా అతడి కుడి తొడకు విజయవంతంగా సర్జరీ ముగిసింది. ఈ విషయాన్ని రాహుల్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బందిలేకుండా సర్జరీ చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
"నా సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. స్మూత్‌గా.. నేను ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకున్న వైద్యులు, మెడికల్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. ఇక నేను రికవరీ అయ్యే పనిలో ఉన్నా. త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి బెస్ట్‌గా మైదానంలో దిగాలనే పట్టుదలతో ఉన్నాను" అని రాహుల్ పేర్కొన్నాడు. ఇక ఈ వార్త విన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ భార్య అతియా శెట్టి, మావయ్య-నటుడు సునీల్ శెట్టి కూడా అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే "నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ శిఖర్ ధావన్ హగ్ ఎమోజీ ట్వీట్ పెట్టాడు. మిస్టర్ 360 సూర్య కుమార్ కూడా ఆకాంక్షించాడు.