IPL 2022 best catches 2022: ఐపీఎల్ 2022 మెగా లీగ్‌లో 23 మ్యాచ్‌లు ముగిశాయి. బ్యాటర్ల సిక్సర్ల మోత, బౌలర్ల వికెట్ల వేట.. ఫీల్డింగ్‌లో అద్భుత విన్యాసాలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. బౌలర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను కట్టడి చేస్తుంటే.. తమ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లనే మలుపుతిప్పుతున్నారు కొందరు ఫీల్డర్స్. అసాధ్యం అనుకున్న క్యాచ్‌లను సైతం ఒంటి చెత్తో ఒడిసిపట్టి ఔరా అనిపిస్తున్నారు. బెస్ట్ క్యాచ్‌లు అందుకున్న సందర్భాలు కొన్ని మీకోసం.
అంబాటి రాయుడు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబాటి రాయుడు అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. 16వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతి బౌన్స్ అయి ఆర్సీబీ ఆటగాడు ఆకాశ్ దీప్ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రాయుడి అద్భుత డైవింగ్‌తో ఒంటి చేత్తో గాల్లోని బంతిని పట్టుకున్నాడు. మూడు వేళ్లతోనే బాల్‌ను పట్టుకుని మోచేతిపై శరీరాన్ని బ్యాలెన్స్ చేసి ఆకాశ్ దీప్‌ను పెవీలియన్ చేర్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
కుల్దీప్ యాదవ్: దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఈ సీజన్లో అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రెండేళ్ల తర్వాత క్రికెట్ ఆడుతున్న కుల్దీప్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్ నంబర్ 19లో తన సొంత బౌలింగ్‌లో అందుకున్న సెన్సేషనల్ క్యాచ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుండా బౌలింగ్ చేశాడు కుల్దీప్ యాదవ్. బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఉమేశ్ బ్యాట్ టాప్ఎడ్జ్కు తగిలి అక్కడే గాల్లోకి లేచింది బంతి. ఇన్నర్ సర్కిల్లో ఫీల్డర్ లేడని గమనించిన కుల్దీప్ వేగంగా వెళ్లి డైవ్ చేస్తూ బంతిని ఒడిసిపట్టాడు. మరోవైపు.. కెప్టెన్ రిషబ్ పంత్ వేగంగా వచ్చినా.. అతడికి వదిలేయకుండా కుల్దీప్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ వైరల్‌గా మారింది.