తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 9:45 AM IST

ETV Bharat / sports

ఈ నలుగురు.. టీ20 ప్రపంచకప్​లో ఆడతారా?

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడింది. సెప్టెంబర్​లో లీగ్ తిరిగి ప్రారంభమవనుందని సమాచారం. అయితే గాయాల కారణంగా ఐపీఎల్​కు దూరమైన పలువురు ఆటగాళ్లు సెప్టెంబర్​లో జరిగే టోర్నీలో బరిలో దిగాలని చూస్తున్నారు. అందులో సత్తాచాటి టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు.

IPL 2021
ఐపీఎల్ 2021

క్రికెటర్లు గాయాల బారిన పడటం మామూలే. అలాగే తిరిగి ఫిట్​నెస్ సాధించడం, బరిలో దిగడం సాధారణమే. అయితే కీలక ఆటగాళ్లు, మెగా టోర్నీలకు ముందు గాయపడితే అతడి గురించి అటు టీమ్​లో, ఇటు అభిమానుల్లో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. అప్పటివరకు అతడు కోలుకుంటాడా?, కోలుకున్నా ఫిట్​నెస్ సాధిస్తాడా?, ఫిట్​నెస్ సాధించినా గత ఫామ్​ను తిరిగి అందుకుంటాడా? అన్నది అసలైన ప్రశ్న. ఈ ఏడాది అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్​లో గాయపడిన ఆటగాళ్లు ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నారు. మళ్లీ వారు ఎప్పుడు బరిలో దిగుతారు? ఫామ్​ను తిరిగి అందుకుంటారా? అన్న అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మెగాటోర్నీకి ముందు గాయపడిన కీలక ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

శ్రేయస్ అయ్యర్ (దిల్లీ క్యాపిటల్స్)

దిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి వన్డేలో గాయపడ్డాడు. భుజంలోని ఎముక స్థానభ్రంశం చెందడం వల్ల ఇతడు ఈ సిరీస్​కు దూరమవుతాడని మొదట ప్రకటించింది బీసీసీఐ. కానీ గాయం పెద్దది కావడం వల్ల చికిత్స అవసరమని భావించిన బోర్డు ఐపీఎల్ 2021లోనూ శ్రేయస్ పాల్గొనట్లేదని వెల్లడించింది. ఏప్రిల్​లో తన భుజానికి చికిత్స చేసుకున్న శ్రేయస్ ప్రస్తుతం ఇంటివద్ద కోలుకుంటున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం వల్ల సెప్టెంబర్​లో పునఃప్రారంభమయ్యే లీగ్​లో బరిలో దిగాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీకి ముందే ఇతడు శ్రీలంకలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపికవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్

బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్)

రాజస్థాన్ రాయల్స్​కు బెన్ స్టోక్స్​ ప్రధాన ఆల్​రౌండర్. ఇతడిపైనే జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సీజన్​లో పంజాబ్ కింగ్స్​తో జరిగిన మొదటి మ్యాచ్​లోనే జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్​లో క్రిస్​ గేల్ ఇచ్చిన క్యాచ్​ను అందుకునే సమయంలో స్టోక్స్​ ఎడమచేతి వేలు విరిగింది. దీంతో ఇతడు లీగ్​ మొత్తానికి దూరమయ్యాడని ప్రకటించింది ఫ్రాంచైజీ. తర్వాత ఇంగ్లాండ్ పయనమైన స్టోక్స్​ చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తాడని అనుకుంటున్నారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్లు మిగతా ఐపీఎల్​లో పాల్గొనే అవకాశం లేదని తెలిపింది. టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్టోక్స్

నటరాజన్ (సన్​రైజర్స్ హైదరాబాద్)

ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా టీమ్ఇండియాకు ఎంపికై సత్తాచాటిన పేసర్ నటరాజన్​ ఎన్నో ఆశలతో ఐపీఎల్ 2021లో అడుగుపెట్టాడు. మొదటి రెండు మ్యాచ్​లు ఆడిన ఇతడు ఆ తర్వాత గాయం కారణంగా పూర్తి లీగ్​కు దూరమవుతున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఇటీవలే విజయవంతంగా మోకాలి చికిత్స పూర్తి చేసుకున్న నటరాజన్ సెప్టెంబర్​లో తిరిగి ప్రారంభమయ్యే లీగ్​లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీలో కనుక మంచి ప్రదర్శన కనబరిస్తే టీ20 ప్రపంచకప్​కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.

నటరాజన్

జోఫ్రా ఆర్చర్

ఈ ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్​కు జోఫ్రా ఆర్చర్ గాయం మరో దెబ్బే. టీమ్ఇండియాతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన ఆర్చర్​ లీగ్​కు పూర్తిగా దూరమయ్యాడు. బాత్​రూమ్​లో తన వేలికి గాజుముక్క గుచ్చుకోవడం వల్ల చికిత్స అవసరమైంది. అనంతరం విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకున్న ఇతడు ఇటీవలే కౌంటీ క్రికెట్​లో అడుగుపెట్టాడు.

ఆర్చర్

ABOUT THE AUTHOR

...view details