ఐపీఎల్-14 సీజన్(IPL) రెండోదశ మ్యాచ్‌ల షెడ్యూలు తయారీలో సతమతమవుతున్న బీసీసీఐ(BCCI)కి ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. డబుల్‌హెడర్‌లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని, అక్టోబరు 15న ఫైనల్ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ అక్టోబరు 10 దాటి టోర్నీని నిర్వహణకు అనుమతించేందుకు ఐసీసీ(ICC) సుముఖంగా లేదట.
ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని.. సెప్టెంబరు-అక్టోబరులో మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ గత నెలలోనే ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021)కు ముందు టోర్నీకి అనుమతి ఇవ్వగలుగుతామా లేదా అన్నది జూన్ చివరినాటికి చెబుతామని ఐసీసీ వెల్లడించింది. మరోవైపు మిగిలి ఉన్న 31 మ్యాచ్‌ల కోసం వీలైనన్ని ఎక్కువ రోజులు తీసుకోవాలన్నది బీసీసీఐ ఉద్దేశం. ఈ విషయమై గత కొన్ని రోజుల్లో వివిధ క్రికెట్‌బోర్డులతోనూ మాట్లాడింది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 10న టోర్నీ ముగియాలి. ఈ తేదీ దాటి టోర్నీ నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి.