గతరాత్రి చెన్నైలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ వేలంలో టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గత మూడేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగిన అతడిని జనవరిలో ఆ జట్టు వదిలేసింది. చివరిసారి 2019 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన హర్భజన్ అప్పటి నుంచీ సరైన మ్యాచ్‌లు ఆడలేదు. అయినా, ఈసారి ఐపీఎల్ వేలంలో తన కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించి బరిలో నిలిచాడు. అయితే, అతడిపై నమ్మకముంచిన కోల్‌కతా అంతే ధరకు కొనుగోలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా హర్భజన్ తనను తీసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ధన్యవాదాలు చెప్పాడు. గతరాత్రి ఓ ట్వీట్ చేస్తూ ఆ జట్టుకు మాట కూడా ఇచ్చాడు. కేకేఆర్ మరో ట్రోఫీ గెలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. తనను ఆ జట్టులో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన నుంచి ఎల్లప్పుడూ వంద శాతం కచ్చితమైన ప్రదర్శన ఆశించొచ్చని భరోసా ఇచ్చాడు. త్వరలోనే ఆ జట్టుతో కలుస్తానని సంతోషం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన కోల్‌కతా.. భజ్జీ రాకను స్వాగతించింది. మరిన్ని వరుస విజయాలు అందించే ఆటగాడు వచ్చాడని, అతడి రాకతో మరింత ఆనందం నెలకొందని రీట్వీట్ చేసింది.
ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడిన వెటరన్ స్పిన్నర్ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. మరోవైపు 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న అతడు 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆ జట్టు ఫైనల్ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో హర్భజన్ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది. దాంతో కోల్‌కతా ఇప్పుడు కొనుగోలు చేసింది. మరి త్వరలో జరగబోయే మెగా ఈవెంట్‌లో ఈ సీనియర్ స్పిన్నర్ తన మాట నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.