తెలంగాణ

telangana

'ఆ ఐదు రోజులు గదిలోనే ఉండిపోయాం'

By

Published : May 11, 2021, 10:44 PM IST

బయోబబుల్​లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు ముస్తాఫిజుర్(బంగ్లాదేశ్​)​. ఐపీఎల్​ ఆడేటప్పుడు ఒక జట్టులోని సభ్యుడికి కరోనా సోకడం వల్ల తనను కూడా ఐదారు రోజుల పాటు ఓకే గదిలో ఉంచారని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు.

mustafizur
ముస్తాఫిజుర్

బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటం వల్ల ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే కొంతమంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు పయనం కాగా, మరికొంతమంది క్వారంటైన్‌ నిబంధనల కారణంగా ఇంకా భారత్‌లోనే ఉన్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఆడిన షకీబ్‌ అల్ హసన్‌.. ఐపీఎల్ వాయిదా పడిన అనంతరం ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ చేరుకున్నారు. అయితే, కొన్ని నెలలుగా తాను న్యూజిలాండ్, భారత్‌లో ఐసోలేషన్, బయో బబుల్‌లో ఉండి మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ముస్తాఫిజుర్ మాట్లాడాడు.

"నిరంతరం బయోబబుల్‌లో ఉండటం వల్ల తీవ్రమైన అలసట కలుగుతుంది. ఇది రోజురోజుకీ కష్టతరంగా మారేది. హోటల్‌ నుంచి మైదానానికి, మైదానం నుంచి హోటల్‌కు.. ఇదే దినచర్యగా మారితే మీరేలా ఉండగల్గుతారు. అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా కొవిడ్ నిబంధనలు అంతటా ఒకేలా ఉంటాయి. వీటిని పాటించడం ప్రతి ఒక్కరికీ కష్టంగానే ఉంటుంది. కానీ నేను ఏమీ చేయలేను. భారత్‌లో ఉన్నప్పుడు బయోబబుల్‌లో సురక్షితంగా ఉన్నాం. ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్‌ చేరుకున్నాం. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నా. అయితే, ఒక జట్టులోని సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం మమ్మల్ని ఐదారురోజులపాటు ఒక గదిలోనే ఉంచారు. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది " అని ముస్తాఫిజుర్‌ పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details