ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఐపీఎల్ 2023 సీజన్ ఆడటం లేదని దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. దిల్లీ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేయగల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం వెతుకుతున్నామని తెలిపాడు. తాజాగా ఐసీసీ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్.. రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌కు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం బాధకరమైన విషయమని చెప్పిన పాంటింగ్.. అతడు అప్‌కమింగ్ సీజన్ ఆడకున్నా డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తానని వెల్లడించాడు.
"రిషబ్ పంత్ చాలా మొండివాడు. అతడిలో నాకు బాగా నచ్చేది కూడా ఇదే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని అతడికి ఫోన్‌లో చెప్పాను. అతడు మాత్రం ఈ టైమ్‌లో కూడా జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. పంత్ కారు ప్రమాదం గురించి తెలియగానే చాలా భయమేసింది. యాక్సిడెంట్‌కు గురైన కారు స్థితిని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టాయి. రిషభ్ పంత్ చాలా మంచి కుర్రాడు. అతని గురించి తెలిసిన ఎవరైనా, రిషభ్ పంత్‌ను ప్రేమిస్తారు, ఇష్టపడతారు. రిషభ్ పంత్‌లో ఓ అందమైన ప్రపంచం ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. రిషభ్ పంత్ వీలైనంత తొందరగా క్రీజులోకి తిరిగి రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నా. రిషబ్ పంత్ ప్లేస్‌ని రిప్లేస్ చేయడం చాలా కష్టం."