IPL 2022 Mega auction: ఎంతో ఆసక్తిగా సాగిన ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి చాలా మంది ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారు. గత సీజన్ కన్నా ఈ సారి భారీ ధరకు అమ్ముడుపోయారు. వీరిలో చాలా మంది యువ క్రికెటర్లు ఉండంట విశేషం. భారీ ధరను దక్కించుకున్న క్యాప్‌డ్, అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ఇద్దరూ భారత్‌కే చెందినవారు కావడం అభిమానులకు మరింత కిక్‌ను ఇచ్చింది. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్లను దాదాపు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేసి దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో గతసారి కన్నా భారీ ధరను దక్కించుకున్న ప్లేయర్స్ ఎవరు? వారిని ఏ జట్టు కొనుగోలు చేసింది? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..
ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్
IPL Mega auctin 2022 Ishan kishan: ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మెగా వేలంలో అందరి కంటే ఎక్కువ ధరను సొంతం చేసుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. IPL 2022 ముంబయి ఇండియన్స్ రూ. 15.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత వేలంలో ఇషాన్‌కి దక్కింది రూ. 6.20 కోట్లు మాత్రమే. వరుసగా రెండేళ్లపాటు (2020,2021) అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఈసారి భారీ డిమాండ్ వచ్చింది. ఈ ఏడాదికి అందుబాటులో ఉండడని తెలిసినా జోఫ్రా ఆర్చర్‌ను ముంబయి రూ. 8 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. అదేవిధంగా యువ ప్లేయర్ టిమ్ డేవిడ్‌పై భారీగా వెచ్చించడం గమనార్హం. ఈ ఆల్‌రౌండర్ కోసం రూ. 8.25 కోట్లను ఖర్చు చేసింది.
దీపక్ చాహర్
IPL Mega auctin 2022 Deepak chahar:చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రవీంద్ర జడేజా తర్వాత అత్యంత విలువైన ఆటగాడు దీపక్ చాహరే. అవునండీ ధోనీ (రూ.12 కోట్లు)ని వెనక్కి నెట్టేసి మరీ వేలంలో రూ. 14 కోట్లను దక్కించుకున్నాడు. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌లను సీఎస్‌కే రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత వేలంలో రూ. 80 లక్షలకే సొంతం చేసుకున్న సీఎస్‌కే.. ఈసారి మాత్రం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న దీపక్ చాహర్‌కు ఆ మాత్రం రేటు ఇవ్వకతప్పలేదు.
కెప్టెన్ అయ్యే అవకాశం
IPL Mega auctin 2022 Shreyas iyer: శ్రేయస్ అయ్యర్ గతంలో దిల్లీ నుంచి రూ 7 కోట్లు అందుకోగా... ఈ సారి కేకేఆర్ రూ. 12.25 కోట్లతో సొంతం చేసుకుంది. కేకేఆర్‌కు నాయకత్వం వహించే అవకాశాలూ లేకపోలేదు. నితీశ్ రాణాను మరోసారి రూ. 8 కోట్లు ఇచ్చి మరీ దక్కించుకుంది. గత సీజన్ వరకు అతడికి చెల్లించింది రూ. 3.4 కోట్లు మాత్రమే. యువ బౌలర్ శివమ్ మావి కూడా మొన్నటి వరకు రూ. 3 కోట్లను మాత్రమే అందుకోగా.. ఈ సారి రూ. 7.25 కోట్ల ధరను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్ మాత్రం దాదాపు సగం కోల్పోయి రూ. 7.25 కోట్లకే
పరిమితమయ్యాడు.
అవేశ్, దీపక్ హుడా, డికాక్, హోల్డర్ :ఆల్‌రౌండర్లతోపాటు బ్యాటర్, బౌలర్ల మీద లఖ్‌నవూ ఇన్వెస్ట్ చేసింది. డికాక్‌ను రూ. 6.75 కోట్లు, జాసన్ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లు, దీపక్ హుడా రూ. 5.75 కోట్లు, మార్క్ వుడ్ రూ. 7.50 కోట్లతో సొంతం చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని దక్కించుకోవడం విశేషం. గతేడాది అవేశ్‌కు దిల్లీ క్యాపిటల్స్ రూ. 70 లక్షలనే చెల్లించింది. దాదాపు 14 రెట్లు అధికంగా వేలంలో సొంతం చేసుకున్నాడు. జాసన్ హోల్డర్‌కు కూడా హైదరాబాద్ రూ. 75 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా 12 రెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
లివింగ్‌స్టోన్, ఓడియన్ స్మిత్, రాజ్ బవా : మెగా వేలంలో లివింగ్‌స్టోన్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ లివింగ్ స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 11.50 కోట్లకు దక్కించుకుంది. 2018 నుంచి వరుసగా మూడేళ్లు రాజస్థాన్‌కే ఆడిన లివింగ్ స్టోన్‌కు అధికంగా వచ్చింది రూ. 75 లక్షలే. ఇప్పుడు అధిక ధరను సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్ల జాబితాలో టాపర్. భారత్‌కు చెందిన ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ రూ. 9 కోట్లను దక్కించుకున్నాడు. అదేవిధంగా తొలిసారి ఐపీఎల్ వేలంలోకి వచ్చిన పాతికేళ్ల విండీస్ ఆటగాడు ఓడియన్ స్మిత్‌ను కూడా పంజాబ్ రూ. 6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఫినిషర్‌గానూ, మిడిల్ ఓవర్లను వేయగల సమర్థుడు. అండర్-19 ఆటగాడు రాజ్‌బవా కూడా మంచి ధరను సొంతం చేసుకున్నాడు. రూ. 2 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, చేతన్ : గత సీజన్ వరకు సీఎస్‌కేకు ఆడిన శార్దూల్ ఠాకూర్‌ను ఈసారి దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. మొన్నటి దాకా రూ. 2.60 కోట్లను మాత్రమే అందుకున్న శార్దూల్ ఈసారి మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు దూసుకెళ్లాడు. అదే విధంగా ఫాస్ట్‌బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా రూ 5.25 కోట్లను అందుకోనున్నాడు. చేతన్ సకారియా కూడా రూ. 4.20 కోట్లను దక్కించుకున్నాడు. వీరందరినీ దిల్లీనే సొంతం చేసుకుంది.
ఫెర్గూసన్, తెవాతియా : ఇక మొన్నటి వరకు కేకేఆర్‌కు ఆడిన లాకీ ఫెర్గూసన్‌ను ఈసారి గుజరాత్ టైటాన్స్ రూ. 10 కోట్లు ఇచ్చి మరీ సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్ వరకు కేవలం రూ. 1.60 కోట్లను మాత్రమే అందుకున్నాడు. మొన్నటి వరకు రూ. 3 కోట్లను అందుకున్న ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియాను ఈసారి రూ. 9 కోట్లకు గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుది. తమిళనాడుకు చెందిన యవ బౌలర్ సాయి కిశోర్ అనూహ్య ధరను సొంతం చేసుకున్నాడు. రూ. 3 కోట్లకు గుజరాత్ తీసుకుంది.
పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మయర్, బౌల్ట్, చాహల్ :ఆర్‌సీబీ ఓపెనర్‌గా రాణించిన దేవదుత్ పడిక్కల్‌కు గత సీజన్ వరకు దక్కింది కేవలం రూ. 20 లక్షలే. అయితే ఈ సారి మెగా వేలంలో కనీస ధర రూ. 2 కోట్లుగా నమోదు చేసుకున్న దేవదుత్‌కు భారీ డిమాండ్ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అదే విధంగా టీమ్‌ఇండియా యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు కాసుల వర్షం కురిసింది. రూ. 10 కోట్లను వెచ్చించి మరీ దక్కించుకోవడం విశేషం. గత సీజన్ వరకు రూ. 20 లక్షలను అందుకున్న ప్రసిధ్ జాక్‌పాట్ కొట్టేశాడు. గత సీజన్ వరకు రూ. 3.20 కోట్లను తీసుకున్న బౌల్ట్ ఈసారి మాత్రం వేలంలో రూ. 8 కోట్లను దక్కించుకున్నాడు. ఆర్‌సీబీ బౌలింగ్ తురుపుముక్కగా మారిన చాహల్‌ను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.
ఆర్‌సీబీలో వీరందరికీ జాక్‌పాట్లే:మెగా వేలంలో ఆర్‌సీబీ తీసుకున్న టాప్ ఆటగాళ్లందరూ అదరగొట్టే ధరను సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా గత సీజన్ పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్, లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను రూ. 10.75 కోట్ల చొప్పున దక్కించుకుంది. మొన్నటి వరకు హర్షల్ రూ. 20 లక్షలు, హసరంగ రూ. 50 లక్షలను మాత్రమే అందుకున్నారు. పద్నాలుగో సీజన్ కప్‌ను సీఎస్‌కే సాధించడంలో డుప్లెసిస్‌ది కీలక పాత్ర. ఈ సారి ఆర్‌సీబీ రూ. 7 కోట్లకు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు రూ. 1.60 కోట్లను మాత్రమే సీఎస్‌కే చెల్లించింది. ఆసీస్ ఆటగాడు హేజిల్‌వుడ్‌కూ రూ. 7.75 కోట్ల భారీ ధర దక్కింది. మొన్నటి వరకు సీఎస్‌కే రూ. 2 కోట్లు మాత్రమే ఇచ్చింది.
ఐదుగురికీ అదృష్టం:సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఐదుగురికి అదృష్టం కలిసొచ్చింది. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రోమారియో షెఫెర్డ్ (రూ.7.75 కోట్లు) అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు) కాగా.. బ్యాటర్లు నికోలస్ పూరన్ (రూ.10.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు) భారీ మొత్తం దక్కించుకున్నారు. ఇక యువ బౌలర్లు కార్తిక్ త్యాగి, టి. నటరాజన్ కూడా నాలుగేసి కొట్లను సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్‌సెన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 4.20 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. సీన్ అబాట్ కోసం రూ.2.40 కోట్లను వెచ్చించింది.
ఇదీ చూడండి:IND VS WI: ఫుల్‌జోష్‌తో టీమ్‌ఇండియా.. పట్టుదలతో విండీస్