గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో అదరగొట్టిన వృద్ధిమాన్ సాహాపై భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మంగళవారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ధోనీ సంగతేంటి?
మ్యాచ్ అనంతరం సాహాపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 'సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌కీపర్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు' అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. రవిశాస్త్రి చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సాహా అత్యుత్తమ వికెట్ కీపర్ అయితే.. మరి ధోనీ సంగతేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. రవిశాస్త్రి గతంలో పలుమార్లు ధోనీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ అని పేర్కొన్నాడు. దీంతో రవిశాస్త్రి చేసిన అప్పటి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు.
దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి హైదరాబాద్, దిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ విజృంభించడంతో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ బౌలర్లు విజృంభించడంతో దిల్లీ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.. వెరసి హైదరాబాద్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగే సుదీర్ఘ క్రికెట్ సిరీస్‌కు టెస్టు జట్టులో సాహా చోటు సంపాదించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:జ్వెరెవ్ వల్లే గర్భవతి అయ్యా: బ్రెండా